NTV Telugu Site icon

Telugu Bhasha Dinotsavam: ‘తెలుగదేల?’ అంటున్న సినీజనం!

Tollywood

Tollywood

Telugu Bhasha Dinotsavam: తెలుగు భాషాదినోత్సవం వస్తే చాలు – రాయలవారు స్వయంగా చాటిన “తెలుగదేల యన్న దేశంబు తెలుగు.. దేశభాషలందు తెలుగు లెస్స ..” అంటూ గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ, నేడు అనేక విధాలా ‘తెలుగు లెస్’ అయిందనే చెప్పాలి. కొందరు ‘తెలుగదేల?’ అనీ ప్రశ్నిస్తున్నారు.

తెలుగు వెలగాలి అని కాంక్షించి భాషా ఉద్యమాలు నడిపారు ఆ నాడు ఎందరో మహానుభావులు. వ్యవహార భాషకే పెద్ద పీట వేస్తూ గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన పోరాట ఫలితంగానే ఈ నాడు వార్తాపత్రికల్లో వ్యావహారిక భాషను చూస్తున్నాం. అందుకే ఆ మహాపురుషుని జన్మదినమైన ఆగస్టు 29వ తేదీని ‘తెలుగు భాషాదినోత్సవం’గా జరుపుకుంటున్నాం.ఈ దినోత్సవాన తెలుగు వెలగాలని ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువారు ఆకాంక్షిస్తూ ఉంటారు. కానీ, ప్రపంచీకరణ కారణంగా అన్నిటా ‘ఆంగ్లం’ ఆధిపత్యం చేస్తోంది. తమ భాషపై అతి ప్రేమ చూపించేవారు సైతం ఆంగ్లం లేకుండా సాగలేకున్న పరిస్థితి. ప్రపంచంలో అత్యధికుల మాతృభాషగా ఉన్న మండేరియన్ భాష సైతం ఇంగ్లిష్ ను తనలో పొందు పరచుకోలేని పరిస్థితి ఏర్పడిందంటే ఆంగ్ల ఆధిపత్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే అదను అనుకొని మన తెలుగు సినిమాల వారు కూడా ‘గ్లోబలైజేషన్’ను చూపిస్తూ, పరభాషా చిత్రాల అనువాదాలకు అవే టైటిల్స్ తోనే తెలుగువారి తలపైనా రుద్దడం ఆరంభించారు. ఇక తమ సినిమా టైటిల్స్ లో తెలుగేతర భాషలు ఎంతలా కనిపిస్తే అంత క్రియేటివిటీ అనుకొనే పరిస్థితి కూడా తెలుగు సినీజనాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి కలవోడా..’ అంటూ పల్లవించిన నేలపై గతాన్ని మరచి, తమ స్వగతం ఏమి చెబితే అదే సబబని భావిస్తున్నారు సినీమేధావులు. గత సంవత్సరం విడుదలైన చిత్రాలలో టాప్ గ్రాసర్స్ గా నిలచిన సినిమాల్లో “అఖండ, ఉప్పెన, జాతిరత్నాలు” మినహాయిస్తే మిగిలిన సినిమాల్లో “పుష్ప- ద రైజ్, వకీల్ సాబ్, క్రాక్, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, రంగ్ దే” వంటివే కనిపిస్తున్నాయి. ఇవేనా అంటే, “మెయిల్, రెడ్, సైకిల్, సూపర్ ఓవర్, మిస్టర్ అండ్ మిసెస్, మధుర వైన్స్, జాంబిరెడ్డి, జి-జాంబి, ఎఫ్.సి.యు.కె., చెక్, ఏ వన్ ఎక్స్ ప్రెస్..” ఇలా చెప్పుకుంటూ పోతే అన్యభాషా పదాల జాతర మరింతగా కనిపిస్తుంది. ఇదేమని అడిగితే, గ్లోబలైజేషన్ లో తప్పదు అంటున్నారు, తప్పులేదనీ చెబుతున్నారు. అత్యంత శక్తిమంతమైన మాధ్యమాల్లో ఒకటయిన సినిమా, దాని తరువాత బుల్లితెరపైనా కూడా తెలుగేతర పదాలే పదనిసలు పలికిస్తున్నాయి.

ఏవీ ఆ రోజుల్లో తెలుగు ఘనతను చాటి చెప్పిన మన తెలుగు చిత్రసీమ వైభవాలు. ‘జైకొట్టు తెలుగోడా..’, ‘తెలుగు జాతి మనది… నిండుగ వెలుగు జాతి మనది..’, ‘కలసి పాడుదాం తెలుగుపాట.. ‘, ‘తేనెకన్నా తియ్యనిదీ తెలుగు భాష..’, ‘తెలుగమ్మాయి తెలుగమ్మాయి..’ ఇలా తెలుగును నాటి నుండి మొన్నటి దాకా వెలిగించిన వారు లేకపోలేదు. అలాంటి వారైనా ‘ప్రపంచీకరణ’ నెపంతో తెలుగును అశ్రద్ధ చేయకుండా ఉంటే బాగుంటుందని భావించారు జనం. కానీ, ‘రౌద్రం- రణం- రుధిరం’ అంటే సాగదీసినట్టు ఉంటుందని ‘ఆర్.ఆర్.ఆర్.’గా ప్రజలను పలకరించారు. నిజమే, ఆంగ్ల ఆధిపత్యాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. కానీ, ఉన్నంతలో తెలుగును వెలిగించడానికి వేదికలు ఏవైనా ఉన్నాయంటే అవి మన చలనచిత్రాలు, బుల్లితెరలే – కనీసం వీటిలోనైనా తెలుగును వెలిగిస్తే, అప్పుడే అసలైన ‘తెలుగు భాషాదినోత్సవం’ జరుపుకున్న వారం అవుతాం.

Show comments