Site icon NTV Telugu

Intinti Ramayanam : స్టార్ మా లో ఉమ్మడి కుటుంబ గాథ.. “ఇంటింటి రామాయణం”

Intinti Ramayanam

Intinti Ramayanam

ఒకప్పుడు ప్రతి తెలుగు లోగిలిలో వైభవంగా వెలిగిన ఉమ్మడి కుటుంబాన్ని మరోసారి తెరపైకి తెస్తూ స్టార్ మా “ఇంటింటి రామాయణం” పేరుతో సరికొత్త సీరియల్ మొదలుపెడుతోంది. ఒక కుటుంబం అంటే ముగ్గురికో నలుగురికో కుదించుకుపోయిన ఈ రోజుల్లో అలాంటి ఉమ్మడి కుటుంబాన్ని చూడడమే ఒక కన్నుల పండుగ. ఆ అపురూపమైన ఇల్లు.. ఓ అచ్చమైన బొమ్మరిల్లు.. ముచ్చటైన పొదరిల్లు. దాదాపుగా 20 మంది వున్న ఆ కుటుంబంలో మనుషుల మధ్య అనుబంధాలు, వాటి ఆనవాళ్లు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ గుర్తుచేయబోతోంది. ఒకప్పుడు మనం చూసి, ఇప్పుడు దూరమైన ఆ మధురానుభూతుల్ని “ఇంటింటి రామాయణం” ప్రియ ప్రేక్షకులకు పంచబోతోంది. సీతమ్మ తల్లి లాంటి కోడలు ఇంటిని నడిపిస్తే అది ఎంత అందంగా ఉంటుందో ఆ ఇంటిని చూసి నేర్చుకోవచ్చు. ఒక ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఎంత బావుంటుందో … వాళ్ళ చెప్పే నాలుగు మంచి మాటలు కుటుంబాన్నిఎంత బాగా నడిపిస్తాయో.. ఆ కుటుంబాన్ని చూసి తెలుసుకోవచ్చు.

 

ఒక చిన్న పిల్ల ఇంటికి వెలుగై ఎంత అందంగా ఉంటుందో అక్కడ చూసి సంబరపడవచ్చు. స్టార్ మా లో జూన్ 10 నుంచి రాత్రి 8.30 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం కాబోతోంది.
రెండు కుటుంబాల మధ్య ఒక పెళ్లితో మొదలైన గొడవ.. ఇంకో పెళ్లితో పరిష్కారం కావాలని తపనపడే ఓ అవని ప్రయత్నం ఎటు దారితీసింది అనేది కథలో ఒక అంశం. ఆవని అంటే ఆ ఇంటి పెద్దకోడలు. పెద్దకోడలిగా ఆమె తీసుకున్న బాధ్యత విజయవంతం అవుతుందా లేదా అనేదానికి సమాధానం తెలియాలంటే “ఇంటింటి రామాయణం” చూడాల్సిందే. సంతోషంగా వున్న ఇంట్లో కూడా ఒక సమస్య వుంది.. అది పరిష్కారం అవుతుందా? లేక ఆ ఉమ్మడి కుటుంబం లోకి కొత్త సమస్యని తీసుకు రాబోతోందా అనే ప్రశ్నకు సమాధానం ఈ ధారావాహిక.

Exit mobile version