‘హనుమాన్’తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తేజ సజ్జా, ఆ సినిమాకు ముందు హీరోగా పెద్దగా గుర్తింపు పొందలేదు. చిన్నతనం నుంచే బాలనటుడిగా అనేక సినిమాల్లో నటించినా, ‘ఓ బేబీ’, ‘జాంబీ రెడ్డి’ వంటి చిత్రాలతో కొంత గుర్తింపు తెచ్చుకున్న, అది సరిపోలేదు. కానీ ‘హనుమాన్’ మాత్రం అతని కెరీర్‌కు పెద్ద మలుపు తీసుకొచ్చింది. అయితే ఈ స్థాయికి చేరుకునే లోపు తేజా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు.
Also Read : Kajal Aggarwal: యాక్సిడెంట్ వార్తలపై స్పందించిన కాజల్.. ఎక్స్ వేదికగా పోస్ట్
తాజాగా ‘మిరాయ్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తేజ తన ఆ కష్టకాలాన్ని గుర్తు చేసుకున్నాడు. హీరో అవ్వాలని ప్రయత్నించే సమయంలో తాను ఎన్నో అవమానాలు, రిజెక్షన్లు, మోసాలు ఎదుర్కొన్నానని చెప్పారు. “అప్పట్లో నాకు అవకాశాలు రావడానికి పెద్దగా బ్యాక్‌గ్రౌండ్ లేదు. దర్శక నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ నాకు కథ చెప్పాడు. షూటింగ్ మొదలు పెట్టి, 15 రోజులు నాతోనే షూట్ చేశాడు. నేను ఆ సినిమాకి హీరోనని అనుకున్నా. కానీ ఒకరోజు సెట్స్‌కి ఇంకో హీరో వచ్చాడు. అసలు ఆ సినిమా అతనికే అని అప్పుడే తెలిసింది. నాతో చేసినది కేవలం మాక్ షూట్ మాత్రమే అని తర్వాత అర్థమైంది” అని తేజ పంచుకున్నాడు.
“నా లాంటి వాళ్లతో ఇలా వ్యవహరించడం ఎంత క్రూరమో చెప్పలేను. కానీ ఇవన్నీ నన్ను మరింత బలంగా చేశాయి. నా కష్టాలు లేకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు” అని అన్నారు. అదేవిధంగా, తేజ తన కెరీర్‌లో చిరంజీవి చేసిన ఒక సహాయాన్ని మరవలేనని చెప్పారు. “చూడాలని ఉంది’ సినిమా కోసం బాల నటుడిని వెతుకుతున్నప్పుడు చాలా ఫోటోలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్లాయి. ఆ ఫోటోలలో ఆయన నా ఫోటోనే సెలెక్ట్ చేశారు. ఆ రోజు ఆయన అలా చేయకపోతే, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు” అని తేజ కృతజ్ఞతతో గుర్తు చేసుకున్నాడు.
