Tammareddy Bharadwaja: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేవారిలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఏ విషయమైన నిర్మొహమాటంగా చెప్పే తమ్మారెడ్డి భరధ్వాజ.. కృష్ణంరాజు విషయంలో తానూ సరిద్దిదుకోలేని తప్పు చేశానంటూ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మూడు రోజుల క్రితం సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతిచెందిన విషయం విదితమే. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ నిన్న ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు,తమ్మారెడ్డి భరధ్వాజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరధ్వాజ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ “నేను నిర్మాతగా నిర్మించిన మొదటి సినిమాకు కృష్ణంరాజే హీరో.. నా సోదరుడు డైరెక్టర్. అయితే అప్పటికే కృష్ణంరాజు సీరియస్ హీరో.. డైరెక్టర్ వచ్చి ఆయనతో సినిమాలో పాటలు పాడించడం ఎలా..? అని చెప్పుకొచ్చాడు.
మొదటి సారి నిర్మాతగా చేస్తున్నా భయపడకుండా ఆయన దగ్గరకు వెళ్లి.. మీలాంటి సీరియస్ హీరోలకు పాటలు పెడితే ఏం బావుంటుంది అని ముఖం మీదే చెప్పేశాను.. వెంటనే ఆ ప్లేస్ లో ఇంకో హీరో ఉంటే బూతులు తిట్టేవారు.. కానీ కృష్ణంరాజు మాత్రం అంటే నేను పాటలకు పనికిరాను అంటావ్ అనేసి.. సినిమా మొత్తం సాంగ్స్ లేకుండానే చేశారు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన.. ఒకానొక సమయంలో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయాలంటే గజగజ వణికిపోయేవాడిని. అలాంటి సిగ్గుమాలిన పని చేశాను నేను.. కృష్ణంరాజు మూడేళ్ళ క్రితం నా దగ్గరకు వచ్చి మూవీ టవర్స్ లో ఒక ఇల్లు కావాలని అడిగారు. వెంటనే నేను.. అది మార్కెట్ రేటు ఉంటుందని చెప్పాను.. ఆయన ఎంతైనా పర్లేదు కొంటాను అని చెప్పారు. అయినా నేను ఒక్క ప్లాట్ ను కూడా కృష్ణంరాజుకు ఇవ్వలేకపోయాను. అది ఎంత సిగ్గుతో కూడిన పనో నాకు తెలుసు. ఆ తరవాత ఆ సిగ్గుతోనే అక్కడి నుంచి బయటికి వచ్చాను. ఆయనకు అలా చేసి ఇప్పుడు ఆయన గురించి మాట్లాడమంటే నాకు సిగ్గుగా ఉంది” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.