Site icon NTV Telugu

Tammareddy Bharadwaj: అందరివాడు.. తమ్మారెడ్డి భరద్వాజ!

tammareddy bharadwaj

tammareddy bharadwaj

కొందరికి సినిమా అయస్కాంతం లాంటిది. వారిలోని ప్రతిభ అనే ఇనుప రజను ఎక్కడికో వెళ్ళాలనుకున్నా, ఇక్కడికే ఆకర్షిస్తూ ఉంటుంది. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి చిత్రసీమలో అభిరుచిగల నిర్మాతగా సాగారు. భరద్వాజ అన్న లెనిన్ బాబు కూడా దర్శకునిగా అలరించారు. కానీ, భరద్వాజ ఎంచక్కా ఇంజనీరింగ్ చదివి, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో ఇంజనీర్ గా సాగాలనుకున్నారు. కానీ, ఆయన ప్రతిభను సినిమా రంగమే ఆకర్షించింది. దర్శక నిర్మాతగా, నటునిగా సాగారు తమ్మారెడ్డి భరద్వాజ. సినిమా కార్మికుల పక్షపాతిగా నిలచి వారికి చేదోడువాదోడుగా ఉంటూ ఈ నాటికీ అందరి చేత అందరివాడు అనిపించుకుంటున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ 1948 జూన్ 30న జన్మించారు. భరద్వాజ పసివాడుగా ఉన్నప్పటికే ఆయన తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి సారథి స్టూడియోస్ నిర్వహణ బాధ్యతలపై హైదరాబాద్ కు వచ్చేశారు. చిన్నతనం నుంచీ సినిమా వాతావరణం చూస్తూ పెరిగారు భరద్వాజ. సికిందరాబాద్ వెస్లీ హై స్కూల్ లో చదివిన భరద్వాజ, తరువాత ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదివారు. కొన్నాళ్ళు హైదరాబాద్ కార్పోరేషన్ లో పనిచేశారు. ఆ పై నీటిపారుదల శాఖలో కొంతకాలం ఇంజనీర్ గా ఉన్నారు. సొంతగా సినిమా తీయాలన్న ఉద్దేశంతో చిత్రసీమలో అడుగు పెట్టి 1979లో తొలి ప్రయత్నంగా చిరంజీవితో ‘కోతలరాయుడు’ చిత్రం నిర్మించారు. వర్ధమాన నటునిగా సాగుతున్న చిరంజీవికి ఈ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టింది. తరువాత కూడా భరద్వాజ నిర్మించిన ‘మొగుడు కావాలి’లో చిరంజీవి హీరోగా నటించారు. అది కూడా జనాన్ని ఆకట్టుకుంది. భరద్వాజ తాను నిర్మించిన ‘ఇద్దరు కిలాడీలు’ ద్వారానే సుమన్ ను పరిచయం చేశారు. ‘మన్మథ సామ్రాజ్యం’తో దర్శకుడయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘అలజడి’ మంచి విజయం సాధించింది. దర్శకునిగా భరద్వాజకూ మంచి పేరు లభించింది.

భరద్వాజ దర్శకత్వంలో “నేటి దౌర్జన్యం, కడప రెడ్డమ్మ, పచ్చని కాపురం, నాగజ్యోతి, పచ్చని సంసారం, రౌడీ అన్నయ్య, బంగారు మొగుడు, అత్తా..నీ కొడుకు జాగ్రత్త, స్వర్ణముఖి, రామ్మా చిలకమ్మా, ఎంత బాగుందో” వంటి చిత్రాలు రూపొందాయి. తరువాత స్వీయ దర్శకత్వంలో “ఊర్మిళ, వేటగాడు, స్వర్ణక్క, సంచలనం, ప్రతిఘటన” వంటి చిత్రాలు నిర్మించారు. ఇతరుల దర్శకత్వంలో “వన్ బై టూ, దొంగ రాస్కెల్, సింహగర్జన, సూరి, నేను పెళ్ళికి రెడీ” వంటి సినిమాలు తెరకెక్కించారు.

వి.కె.నరేశ్ హీరోగా రూపొందిన ‘నేనేరా పోలీస్’లో విలన్ గా నటించి మెప్పించారు భరద్వాజ. ‘ఈ రోజుల్లో’ సినిమాలోనూ కాసేపు తెరపై తళుక్కుమన్నారాయన. కొన్ని టీవీ సీరియల్స్ కూడా భరద్వాజ రూపొందించారు. సొంత యూ ట్యూబ్ ఛానెల్ లో తరచూ చిత్రసీమలోని పలు అంశాలపై తన అభిప్రాయాలు వినిపిస్తూ సాగుతున్నారాయన. ఆయన కామెంట్స్ కొన్నిసార్లు వివాదాలకు దారితీసినా, సినీజనం మాత్రం భరద్వాజను తమ వాడిగానే అభిమానిస్తూ ఉంటారు. భరద్వాజ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.

Exit mobile version