దళపతి విజయ్ తాజా చిత్రం “బీస్ట్”కు ఆయన సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా “బీస్ట్” మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీగా, తమిళ న్యూ ఇయర్ స్పెషల్‌గా ఏప్రిల్ 13న “బీస్ట్” విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు హిట్ అయిన నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ప్రకారం ఓ మాల్ లో ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న వారిని రక్షించే సైనికుడిగా విజయ్ కనిపించబోతున్నాడు. ఈ ట్రైలర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే రికార్డు బ్రేకింగ్ వ్యూస్ రాబట్టింది. అంతే వేగంగా విమర్శలనూ ఎదుర్కొంటోంది.
Read Also : Shah Rukh Khan : “బీస్ట్”కు పెద్ద ఫ్యాన్ అట !!
ముస్లింలను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్న దృశ్యాలను కారణంగా చూపిస్తూ కువైట్ ప్రభుత్వం “బీస్ట్” సినిమాను అక్కడ ప్రదర్శించకుండా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో “బీస్ట్”ను బ్యాన్ చేయాలని తమిళనాడు ముస్లిం లీగ్ పార్టీ అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. “బీస్ట్” విడుదలను నిషేధించాలని కోరుతూ ముస్లిం లీగ్ తమిళనాడు హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ముస్లింలను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తున్నదని తమిళనాడు ముస్లిం లీగ్ అధ్యక్షుడు వీఎంఎస్ ముస్తఫా హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సినిమాల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా అనేక సామాజిక సంస్థలు ముందుకొచ్చాయి. అయితే ముస్లింలను ఇప్పటికీ తీవ్రవాదులుగా చిత్రీకరించడం దురదృష్టకరమని, మతపరమైన సమస్యలకు ఇది కారణమని హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో ముస్తఫా పేర్కొన్నారు. కాగా కువైట్ ప్రభుత్వం గతంలో మలయాళ చిత్రం “కురిప్పు”, విష్ణు విశాల్ “ఎఫ్‌ఐఆర్”లను కూడా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. మరి సొంత రాష్ట్రంలోనే ఇలాంటి ఘటన ఎదురవ్వడం విజయ్ కు షాకిచ్చే విజయమనే చెప్పొచ్చు. మరి మేకర్స్ ఈ పరిస్థితిని ఎలా డీల్ చేస్తారో చూడాలి.
