Satyam Rajesh: గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మా ఊరి పొలిమేర -2’. ‘సత్యం’ రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవివర్మ, ‘చిత్రం’ శ్రీను ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది సినిమా. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన, మూవీ పోస్టర్ బాగుందని, సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నానని చెబుతూ, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
నటుడు ‘సత్యం’ రాజేశ్ మాట్లాడుతూ, “గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రాన్ని ఎంతో ఆదరించారు. దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘మా ఊరి పొలిమేర -2’ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రాన్నికూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్ముతున్నాం. దర్శకుడు సీక్వెల్ ని అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత గౌరికృష్ణ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు“ అని అన్నారు. నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ, “‘మా ఊరి పొలిమేర’ చిత్రాన్ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం మా బ్యానర్‌లో చేస్తున్నందుకు దర్శకుడు అనిల్ విశ్వనాథ్, నటీనటులకు ధన్యవాదాలు. అందరం ఒక ఫ్యామిలీ లాగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశాం. దర్శకుడు అనిల్ తొలి చిత్రాన్ని మించి ఈ సీక్వెల్ ను తెరకెక్కించారు. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తాం” అని అన్నారు. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ, “‘మా ఊరి పొలిమేర’ చిత్రాన్నిఅందరూ బాగా ఆదరించారు. దానికి సీక్వెల్ ఉందా.. లేదా అని చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానంగా ‘మా ఊరి పొలిమేర -2’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే నిర్మాత వెల్లడిస్తారు” అని అన్నారు. డీఓపీ ఖుషేందర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, ” ‘మా ఊరి పొలిమేర’ చిత్రాన్ని ఓటీటీలో చూసి అమైజింగ్ గా ఫీల్ అయ్యాను. లక్కీగా దాని సీక్వెల్ కు నేను డీఓపీ కావడం చాలా సంతోషంగా ఉంది. స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ అనిల్ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ మూవీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై లెవెల్‌లో ఉంటాయి” అని అన్నారు.