Tabu AI Deepfake: ఆన్‌లైన్‌లో ఏఐ రూపొందించిన అశ్లీల కంటెంట్, డీప్‌ఫేక్ వీడియోలతో తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని బాలీవుడ్ నటి టబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియోలు, ఫొటోలు మాత్రమే కాకుండా తన గొంతు కూడా ఉపయోగించి కొందరు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టబు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.
టబు అసలు పేరు తబస్సుమ్ జమాల్ హష్మీ. ఆమె తన పిటిషన్‌లో పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన ఫొటోలు, ఇంటర్వ్యూలు, బహిరంగ కార్యక్రమాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లను అనుమతి లేకుండా తీసుకుని, వాటిని ఎడిట్ చేసి అభ్యంతరకరమైన కంటెంట్‌గా మార్చుతున్నారని తెలిపారు. కొన్ని వీడియోల్లో శరీర భాగాలను హైలైట్ చేసేలా జూమ్ చేయడం, స్లో చేయడం వంటి మార్పులు చేసి ఆన్‌లైన్ పెడుతున్నారని ఆరోపించారు. ఏఐ ద్వారా సృష్టించిన అశ్లీల ఫొటోలు, వీడియోలు, GIFలు కూడా తన పేరుతో ప్రచారం చేస్తున్నారని ఆమె కోర్టుకు వివరించారు.
ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా. దానిని టబు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. అయితే ఆ ఖాతాతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన తరఫున బుకింగ్‌లు నిర్వహించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో టబు గుర్తింపును ఉపయోగించి ఆర్థికంగా లాభపడే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే అంశం కోర్టు దృష్టికి వెళ్లింది. అంతేకాకుండా టబు ఫొటోలతో మగ్గులు, పోస్టర్లు, క్యాలెండర్లు, హూడీలు, స్వెట్‌షర్టులు వంటి వస్తువులను అనధికారికంగా విక్రయిస్తున్నారని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమె పేరుతో తప్పుడు ప్రకటనలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది.
ఈ కేసులో 150కి పైగా అనుమానాస్పద URLలను కూడా కోర్టు పరిశీలించింది. గూగుల్, మెటా, ఎక్స్, రెడ్డిట్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఆదేశాలు అందుకున్న 36 గంటల్లోగా గుర్తించిన లింకులను తొలగించాలి కోర్టు ఆదేశించింది. అలాగే సంబంధిత ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు అవసరమైన సబ్‌స్క్రైబర్ సమాచారం, IP లాగ్ వివరాలను డొమైన్ సర్వీస్ ప్రొవైడర్లు అందించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మధ్య ఇలాంటి ఏఐ రూపొందించిన అశ్లీల కంటెంట్ సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతోంది. అసలు వీడియోలను పోలీనట్లు ఉంటున్న వీటిని గుర్తించడం కూడా కష్టంగా మారుతోంది. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా వీటిమీద కోర్టులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.
ఇక సినిమాల విషయానికి వస్తే టబు ప్రస్తుతం సౌత్, నార్త్ చిత్ర పరిశ్రమలలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. పూరి జగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ చిత్రంలో ఆమె పవర్‌ఫుల్ ఐటీ డిప్యూటీ కమిషనర్‌గా నటిస్తుండగా, నాగార్జున కింగ్100లో సుదీర్ఘ విరామం తర్వాత నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో మెరవనున్నారు. వీటితో పాటు అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ 2026 అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

