Site icon NTV Telugu

ట్రోలర్స్ కు తాప్సీ ఘాటైన జవాబు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను నటించిన ‘రశ్మీ రాకెట్’ మూవీ అక్టోబర్ 15న జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఇటీవల మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. అథ్లెట్ రశ్మీ పాత్ర కోసం తాప్సీ ప్రాణం పెట్టిందనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. తెలుగులో మంచు లక్ష్మీని మొదలుకొని జాతీయ స్థాయిలో ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు తాప్సీ కృషిని అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే… ఎప్పటిలానే కొంతమంది నెటిజన్లు మాత్రం తాప్సీని విమర్శించడం, ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి వారందరికీ తాప్సీ దిమ్మతిరిగేలా బదులిచ్చింది.

”మీ మనసులోని మాట (క్రూరత్వాన్ని) తెలిపినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు. నిజానికి ఈ దేశంలో చాలామంది మహిళలు తమ తప్పులేకపోయినా ఇలాంటి విమర్శలు రోజూ వినాల్సి వస్తోంది. మన అథ్లెట్స్ ఈ దేశం కోసం, ఆట కోసం తమ చెమటను, రక్తాన్ని ధారపోస్తూ కూడా ఇలాంటి మాటలు పడుతున్నారు” అని తాప్సీ తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా చెప్పింది. దీని గురించి మరింత వివరణ ఇస్తూ, ”ఆడతనం అనే పదాన్ని ఎవరు నిర్వచించగలరు? కండలను బట్టి వారిలో ఆడతనం ఉందో లేదో ఎలా నిర్థారిస్తారు? హార్మోన్స్ లోపం కారణంగా కొంతమంది మహిళలు తమ ప్రమేయం లేకుండానే అలా ఉంటారు. ఆ కారణంగా వారు మగవాళ్ళను తలపిస్తారు. అది తెలుసుకోకుండా విమర్శించడం సరైనది కాదు” అని తాప్సీ ఘాటుగా బదులిచ్చింది.

మహిళా అధ్లెట్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ‘రశ్మీ రాకెట్’ మూవీ తెరకెక్కింది. ఆడతనం లేదనే వంకతో రశ్మీ అనే అమ్మాయిపై చూపిన వివక్ష నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. తనపై వచ్చిన ఆరోపణలకు రశ్మీ ఎలా స్పందించింది? వాటిని ఎలా తిప్పికొట్టిందన్నదే ఈ చిత్రం.

Exit mobile version