NTV Telugu Site icon

కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి

T Subbarami Reddy Birthday Special

(సెప్టెంబర్ 17న టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు)
కాసింత కళాపిపాస ఉంటే చాలు మనసు పులకించే క్షణాలను మనమే వెదుక్కోవచ్చు అంటారు పెద్దలు. ప్రముఖ నిర్మాత, రాజకీయ నేత తిక్కవరపు సుబ్బరామిరెడ్డిలో కాసింత కాదు ఆయన మోసేంత కళాపిపాస ఉంది. అందువల్లే కళలను ఆరాధిస్తూ కళాకారులను గౌరవిస్తూ ‘కళాబంధు’గా జనం మదిలో నిలచిపోయారు సుబ్బరామిరెడ్డి. రాజకీయరంగంలో రాణించిన సుబ్బరామిరెడ్డి చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికిస్తూ సాగారు. జయాపజయాలకు అతీతంగా సుబ్బరామిరెడ్డి చిత్రప్రయాణం సాగింది. తెలుగువారయినా హిందీలోనూ చలనచిత్రాలు నిర్మించారు. నిజం చెప్పాలంటే మాతృభాషలో ఆయన నిర్మించిన చిత్రాలకన్నా హిందీలో భాగస్వామ్యంతో నిర్మించిన సినిమాలే మంచి విజయం సాధించాయి. ఇక సంస్కృతంలోనూ ‘భగవద్గీత’ చిత్రాన్ని నిర్మించి, సహజంగా భక్తిభావం మెండుగా ఉన్న సుబ్బరామిరెడ్డి తన భక్తినీ చాటుకున్నారు.

అజాత శత్రువు
టి.సుబ్బరామిరెడ్డి 1943 సెప్టెంబర్ 17న జన్మించారు. ఆయన తండ్రి బాబుల్ రెడ్డి ఆ రోజుల్లోనే పేరు మోసిన కాంట్రాక్టర్. సుబ్బరామిరెడ్డి సైతం కొన్నేళ్ళు తండ్రి బాటలోనే సాగారు. ఆ నాడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ గా నిలచిన నాగార్జున సాగర్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ విజయానికి తన చేతనైన సాయం అందించారు. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీని అభిమానించే కుటుంబం నుండి వచ్చిన వారు కావడంతో ఆ పార్టీలోనే సుబ్బరామిరెడ్డి సైతం కొనసాగారు. అయితే అన్ని పార్టీల వారితోనే ఎంతో స్నేహభావంతో మసలుకొనేవారు సుబ్బరామిరెడ్డి. అందుకే ఆయనను అందరూ అభిమానంగా అజాత శత్రువు అనీ పిలుస్తుంటారు.

కళారాధనలో…
సుబ్బరామిరెడ్డి నెల్లూరుకు చెందినవారే అయినా ఉత్తరాదికి చెందిన వారిలా ఉంటారు. చాలామంది ఆయనను నార్త్ ఇండియన్ అనుకొనేవారు. కొందరు హీరోలా ఉన్నావ్ సినిమాల్లో ట్రై చేయరాదూ అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో అక్కినేని నాగేశ్వరరావు బంజారా హిల్స్ ఇంటి పక్కనే సుబ్బరామిరెడ్డి ఇల్లు ఉండేది. దాంతో ఏయన్నార్ తో సత్సంబంధాలు ఉండేవి. ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘బంగారు కలలు’ చిత్రంలో ఆయన కొన్ని క్షణాలు తెరపై తళుక్కుమన్నారు. అందులో అందాల నటి వహిదా రెహమాన్ “నాలోన వలపుంది… మీలోన వయసుంది…” అనే పాటలో నృత్యం చేస్తూ కనిపిస్తారు. ఆ పాటలో “నీ రాణి నేనే… నా రాజు నీవే…” అనే పంక్తి వచ్చే చోట, ఆమె బుగ్గ మీద చిటికేస్తూ కనిపిస్తారు సుబ్బరామిరెడ్డి. ఆ తరువాత నుంచీ సినిమాలపైనా, కళలపట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. కళాకారులను గౌరవించడంలో తనదైన బాణీ పలికించారు. అందువల్ల “కళాబంధు, కళారత్న, కళా సమ్రాట్, కళాతపస్వి” వంటి బిరుదులు ఆయనను వరించాయి.

చిత్రసీమలో…
చలన చిత్రసీమలోనూ సుబ్బరామిరెడ్డి తన బాణీ పలికిస్తూ సాగారు. తాను ఇటు రాజకీయాల్లోనూ, ఇటు సాంస్కృతి కార్యక్రమాల్లోనూ బిజీగా ఉన్న కారణంగా, ప్రముఖ నిర్మాతలతో కలసి చిత్ర నిర్మాణంలో పాలుపంచుకొనేవారు. అలా ప్రముఖ నిర్మాత డి.రామానాయుడుతో కలసి తెలుగులో విజయం సాధించిన ‘కథానాయకుడు’ చిత్రాన్ని హిందీలో మిథున్ చక్రవర్తి హీరోగా ‘దిల్ వాలా’గా నిర్మించారు సుబ్బరామిరెడ్డి. అదే సమయంలో పి.శశిభూషణతో కలసి ‘రోటీ కపడా ఔర్ మకాన్’ చిత్రాన్ని తెలుగులో ‘జీవనపోరాటం’ పేరుతో తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలు నిర్మాతగా ఆయనకు సంతృప్తిని కలిగించాయి. హిందీ ‘నసీబ్’ చిత్రాన్ని తెలుగులో ‘త్రిమూర్తులు’గా రీమేక్ చేశారు. ఈ చిత్రంలో ఆ నాటి మేటి టాలీవుడ్ హీరోలు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి వారు ఓ పాటలో కనిపించారు. ఇది కేవలం సుబ్బరామిరెడ్డితో తమకున్న అనుబంధంతో వీరందరూ అలా తళుక్కుమన్నారు. చిరంజీవి హీరోగా ‘స్టేట్ రౌడీ’ చిత్రం నిర్మించగా, ఆ సినిమా తెలంగాణలో మంచి విజయం సాధించింది. వెంకటేశ్ తో ‘సూర్య ఐపీయస్’, రాజశేఖర్ తో ‘గ్యాంగ్ మాస్టర్’, బాలకృష్ణతో ‘వంశోద్ధారకుడు’ వంటి చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఇక హిందీలో ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు యశ్ చోప్రాతో కలసి “చాందినీ, లమ్హే” చిత్రాలను నిర్మించారు. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని మూటకట్టుకున్నాయి.

‘భగవద్గీత’
ప్రముఖ దర్శకుడు జి.వి.అయ్యర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఆదిశంకరాచార్య’ సంస్కృత భాషలో రూపొందిన తొలి చిత్రం. ఆ జి.వి. అయ్యర్ దర్శకత్వంలోనే సంస్కృతంలో ద్వితీయ చిత్రంగా ‘భగవద్గీత’ను అద్వితీయంగా నిర్మించారు టి.సుబ్బరామిరెడ్డి. ఈ సినిమా దేశవిదేశాల్లో ఉన్న భక్తకోటిని విశేషంగా అలరించింది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డు కూడా దక్కింది. కొలంబియాలో జరిగిన ‘బొగోటా చలనచిత్రోత్సవం’లోనూ ‘భగవద్గీత’ ఉత్తమ చిత్రంగా నిలచింది. తరువాత హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ‘స్వామి వివేకానంద’ చిత్రాన్ని జి.వి.అయ్యర్ దర్శకత్వంలోనే నిర్మించారు. ఈ సినిమా ద్వారా మిథున్ చక్రవర్తికి ఉత్తమ సహాయనటునిగా జాతీయ అవార్డు లభించింది. ఇలా ఇతర భాషల్లో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్న టి.సుబ్బరామిరెడ్డి తెలుగులో మాత్రం కమర్షియల్ మూవీస్ తోనే సరిపెట్టుకున్నారు.

రాజకీయరంగంలో…
మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న టి.సుబ్బరామిరెడ్డి 1996, 1998 ఎన్నికల్లో విశాఖ పట్టణం పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. 2002, 2008, 2014 వరుసగా మూడు సార్లు రాజ్యసభకు సుబ్బరామిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అలా దాదాపు రెండు దశాబ్దాలు దిగువ, ఎగువ సభల్లో సుబ్బరామిరెడ్డి కొనసాగారు. అనేక పార్లమెంటరీ కమిటీలలో సుబ్బరామిరెడ్డి సభ్యునిగా ఉన్నారు. 2006 – 2008 మధ్యకాలంలో కేంద్ర గనులశాఖ స్టేట్ మినిస్టర్ గా వ్యవహరించారు. 2012లో నెల్లూరు పార్లమెంటరీ నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. నిత్యం దేవతార్చన చేస్తూ సాగే సుబ్బరామిరెడ్డి ‘తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు’ అధ్యక్షునిగానూ సేవలందించారు. ఎక్కడ ఏ పదవిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా తన కళాపిపాసను మాత్రం ఆయన మరచిపోలేదు. తన పేరుమీద సినీ,సాంస్కృతి కళాకారులకు అవార్డులు ఇచ్చి గౌరవించడంలోనూ ఆయన ఆనందం సొంతం చేసుకుంటూ ఉంటారు. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.