Site icon NTV Telugu

Anil Ravipudi : మా తరానికి ఆయనే ఇన్‌స్పిరేషన్‌ – అనిల్ రావిపూడి

Anil Ravipudi

Anil Ravipudi

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా తనదైన ముద్ర వేసుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు అంటే అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో చెప్పక్కర్లేదు. మళ్లీ ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘వేదవ్యాస్’. ఈ సినిమాను ఆగస్టు 28న హైదరాబాద్‌లో ఘనంగా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్‌లో ఇది 43వ సినిమా కావడం విశేషం. సాయి ప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతగా, వ్యాపారవేత్తగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రసిద్ధి చెందిన ఆయన, ఈ సినిమాకు భారీ స్థాయిలో నిర్మాణం చేపట్టారు. ఈ చిత్రాన్ని కె. అచ్చిరెడ్డి సమర్పిస్తున్నారు.

Also Read : War 2 : డిజిటల్ రిలీజ్‌కు రెడి అయిన ‘వార్ 2’ !

ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే, సౌత్ కొరియా హీరోయిన్ జున్ హ్యూన్ జీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఈ క్రాస్ కల్చరల్ కాంబినేషన్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ లాంచ్ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకులు వీవీ వినాయక్, అనిల్ రావిపూడి, నటులు అలీ, మురళీమోహన్, జుబేదా అలీ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ క్లాప్ కొట్టడం, కెమెరా స్విచ్ ఆన్ చేయడం వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ..

“దిల్ రాజు గారు చెప్పినట్టే, ఎస్వీ కృష్ణారెడ్డి – అచ్చిరెడ్డి కాంబినేషన్ అనగానే ఒక సెన్సేషన్ గుర్తొస్తుంది. మేము స్కూల్‌ బ్యాగులు వేసుకొని వెళ్లే రోజుల్లోనే వాళ్లు వరుస బ్లాక్‌బస్టర్లు ఇచ్చారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి ఒక బ్రాండ్‌గా నిలిచిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారు మా తరానికి నిజమైన ఇన్‌స్పిరేషన్‌. ఆయన 43వ సినిమా ‘వేదవ్యాస్’ కూడా ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. ఇప్పటికే ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎంత బాగా కనెక్ట్ అవుతాయో తెలిసిందే. అందుకే ఆయన కొత్త సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా కొరియా హీరోయిన్ ఎంట్రీ, అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి స్పెషల్ టచ్ ఈ సినిమాకు హైలైట్ కానున్నాయి.

Exit mobile version