తెలుగు సినిమా నిర్మాణ సంస్థలు ఇప్పుడు తమిళంలోనూ సినిమాలను నిర్మించడం మొదలైంది. దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ వంటి నిర్మాతలు తమిళచిత్రాలు మొదలు పెట్టారు. అలానే యూవీ క్రియేషన్స్ కూడా పరభాషా చిత్రాలను, బహుభాషా చిత్రాలను కొంతకాలంగా నిర్మిస్తోంది. తాజాగా తమిళంలో స్టూడియో గ్రీన్ తో కలిసి హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబినేషన్ లో ఓ సినిమాను ప్రారంభించింది. విలక్షణ పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సూర్య.
అలానే తెలుగుతో పాటు పలు తమిళ సూపర్ హిట్ మూవీ తీసి దర్శకుడిగా గుర్తింపు పొందాడు సినిమాటోగ్రాఫర్ శివ. వీరిద్దరితోనూ ఈ సినిమా తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ నెం 25గా యువి క్రియేషన్స్‌తో సంయుక్తంగా ఒక భారీ ప్రాజెక్టుకు ముహూర్తం పెట్టారు. బుధవారం సినిమా షూటింగ్ మొదలైంది. చిత్ర యూనిట్‌తో పాటు అతిరథ మహారధుల సమక్షంలో ఓపెనింగ్ జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
