Site icon NTV Telugu

దర్శకుడు బాలాతో సూర్య సినిమా!

Surya

Surya

సీనియర్ తమిళ నటుడు శివకుమార్ తనయుడు సూర్య నటుడిగా ‘నంద’ సినిమాతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. 2001లో విడుదలైన ఆ సినిమాకు దర్శకుడు బాలా. ఆ తర్వాత మూడేళ్ళకు బాలా దర్శకత్వంలోనే సూర్య ‘పితామగన్’ చిత్రంలో విక్రమ్ తో కలిసి నటించాడు. ఈ సినిమా కూడా అతనికి నటుడిగా మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. ఇక విశాల్, ఆర్య హీరోలుగా బాలా తెరకెక్కించిన ‘అవన్ ఎవన్’ సినిమాలో సూర్య గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. బాలాతో ఉన్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆయన దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గురువారం సూర్య ట్వీట్ చేశాడు. బాలా, తన తండ్రితో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, ‘నన్ను నాకంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి బాలా. ఆయనతో మరో సరికొత్త ప్రయాణానికి నాన్నగారి ఆశీస్సులతో శ్రీకారం చుట్టబోతున్నాను’ అని సూర్య పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు బాలాతో సూర్య నిర్మిస్తున్న సినిమాలో అతను నటించడం లేదని, అధర్వ మురళీ, కీర్తిసురేశ్ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ విషయమై సూర్య ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే సూర్య నటించిన తాజా చిత్రం ‘జై భీమ్’ నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Read Also : ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో నాగార్జున భేటీ

Exit mobile version