NTV Telugu Site icon

Superstar Krishna No More : నేలరాలిన కృష్ణ‘తార’

Krishna Death News

Krishna Death News

Superstar Krishna: సూపర్‌స్టార్ కృష్ణ ఇక లేరు. ఆదివారం రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలితో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా బ్రెయిన్‌తో పాటు కిడ్నీ, లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌గా చెప్పుకోవచ్చని, డయాలసిస్ కూడా జరుగుతోందని వైద్యం అందిస్తున్నప్పుడు వైద్యులు తెలిపారు. 8 విభాగాలకు చెందిన 8 మంది వైద్య నిపుణుల్ని రంగంలోకి దిగి.. ప్రపంచస్థాయి చికిత్సని అందించారు. కానీ.. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, వెంటిలేటర్‌పై కన్నుమూశారు. కృష్ణ మృతితో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ అభిమాన నటుడు ఇక లేడన్న విషయం తెలిసి, అభిమానులు సైతం కన్నీరుమున్నీరు అవుతున్నారు.

కాగా.. సూపర్‌స్టార్ కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. ఈయన 1943 మే 31వ తేదీన జన్మించారు. ‘కులగోత్రాలు’ సినిమాతో తెరంగేట్రం చేసిన కృష్ణ.. ‘తేనె మనసులు’ చిత్రంతో కథానాయకుడిగా మారారు. సోలో హీరోగా కృష్ణ నటించిన మొదటి సినిమా ‘గూఢాచారి 116’. కృష్ణ తెలుగునాట 325పై చిలుకు చిత్రాల్లో నటించారు. ఈయన సినిమాల్లో విజయనిర్మల కథానాయికగా ఎక్కువ సినిమాల్లో నటించారు. కృష్ణ – విజయనిర్మల కలిసి తొలిసారి ‘సాక్షి’ సినిమాలో జోడీ కట్టారు. ఈయన ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే తొలి కౌబాయ్ సినిమా చేశారు. ఈ సినిమానే ఆయనకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఎన్టీ రామారావుతో కలిసి తొలిసారి ‘స్త్రీ జన్మ’ అనే సినిమాలో నటించారు. ‘మంచి కుటుంబం’ సినిమాలో ఏఎన్నార్ అల్లుడి పాత్ర పోషించారు. కృష్ణ తన సొంత నిర్మాణంలో ‘అగ్నిపరీక్ష’ అనే సినిమాను నిర్మించారు. అప్పట్లో కృష్ణ, శోభన్ బాబు మధ్య బాక్సాఫీస్ వార్ బాగానే నడిచింది.

అలాంటి కృష్ణ, శోభన్ బాబు కలిసి ‘ముందడుగు’ అనే మల్టీస్టారర్ సినిమా చేయగా.. అదే ఏకంగా గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకుంది. ఇప్పటికీ గోల్డెన్ జూబ్లీ చేసుకున్న ఏకైక సినిమాగా ‘ముందడుగు’ చరిత్రలో నిలిచిపోయింది. కృష్ణ తన 100వ చిత్రంగా ‘అల్లూరి సీతారామరాజు’, 200వ చిత్రంగా ‘ఈనాడు’, 300వ చిత్రంగా తెలుగు వీర లేవరా చేశారు. ఆ మేజిక్ ఫిగర్‌కి తగినట్లుగానే ఆ చిత్రాలు ఆయన కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం), తొలి టెక్నోవిజన్ సినిమా (దొంగల దోపిడీ) వంటి ఘనతలు కృష్ణ పేరిట ఉన్నాయి. చివరిసారిగా కృష్న ‘శ్రీ శ్రీ’ సినిమాలో కనిపించారు.