Sundeep Kishan: కుర్ర హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా సందీప్ కు ఆశించనంత ఫలితం రాలేదు. దీంతో ఈసారి ఎలా అయినా మంచి విజయాన్ని అందుకోవాలని కసితో థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ నటిస్తున్న చిత్రం ఊరి పేరు భైరవకోన. ఈ చిత్రంలో సందీప్ సరసన వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన సందీప్ కిషన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో సందీప్ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. తనకు ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. ఏకంగా మూడుసార్లు బ్రేకప్ అయ్యిందని, అది కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ తోనే అని చెప్పడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ” నా జీవితంలో మూడు బ్రేకప్స్ అయ్యాయి. ఇప్పటివరకు నేను ముగ్గురు అమ్మాయిలను ప్రేమించాను. ఆ మూడుసార్లు కూడా ఎంతో సీరియస్ గా లవ్ చేశా. ఒకరితో నాలుగేళ్లు ఉన్నాను. మరొకరితో రెండేళ్లు.. ఇంకొకరితో రెండున్నర ఏళ్ళు సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నాను. కానీ, ఏది వర్కౌట్ కాలేదు. అయితే నేను ఈరోజు ఉన్న పొజిషన్లో ఒకసారి ఆలోచిస్తే అవేమీ నా జీవితంలో అంత ముఖ్యం కాదనిపించింది. నేను ప్రేమించిన ముగ్గురు ఇండస్ట్రీకి చెందిన వారే. అయితే ఏళ్ల తరబడి ప్రేమలో ఉన్నా కూడా వాళ్ళు ఎవరు అనేది నేను బయటకు రానివ్వలేదు. ఎంతో సీక్రెట్ గా మా లవ్ మ్యాటర్ ను మెయింటైన్ చేశాను. ఇక ఆ ముగ్గురిలో ఒకరు రెజీనా అంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే రెజీనాకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. తను నా బెస్ట్ ఫ్రెండ్. కాలేజ్ చదువుతున్నప్పుడు నుంచి తను నాకు తెలుసు. నా కష్టాలు, నష్టాలు, లవ్, బ్రేకప్ అన్ని తను చూసింది. ఎప్పుడు తను నాతో పాటే నాకు సపోర్ట్ గా నిలబడింది. ఇక పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇప్పుడు అప్పుడే నేను పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేను. ఎందుకంటే ఇంట్లో కూడా పెళ్లి గురించి పోరు పెట్టట్లేదు. కాబట్టి దానికి ఇంకా టైం ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సందీప్ మాటలు విన్నాక అభిమానులు ఆరెంజ్ సినిమా డైలాగ్ చెప్పుకొస్తున్నారు. ముగ్గురు హీరోయిన్స్ తో బ్రేకప్ గ్రేట్ కాదు బాసూ.. సీక్రెట్ గా మెయింటైన్ చేశావ్ చూడు.. అది గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో సందీప్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.