గతంలో పలు తెలుగు చిత్రాలలో నటించిన సునైన ‘రాజ రాజ చోర’తో టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ‘నీర్పరవై’ వంటి చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులని మెప్పించి, ఇటీవల ‘సిల్లు కారుపట్టి’ అంథాలజీతో మరోసారి నటనతో ఆకట్టుకుంది సునైనా. తాజాగా ఆమె ‘రెజీనా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.
కోయంబత్తూరుకు చెందిన ఎల్లో బేర్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ లో కొత్త నిర్మాత సతీష్ నాయర్ దీన్ని నిర్మిస్తున్నారు. ‘పైపిన్ చువత్తిలే ప్రణయం’, ‘స్టార్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన డొమిన్ డిసిల్వా దీనికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ షూటింగ్ ఆదివారంతో పూర్తయ్యింది. దీని గురించి దర్శకుడు డిసిల్వా మాట్లాడుతూ, ”ఇదో ఫిమేల్ సెంట్రిక్ స్టైలిష్ థ్రిల్లర్. ప్రవాహానికి ఎదురీదే చేపలాగా.. ఒక సాధారణ గృహిణి అసాధారణమైన పని ఎలా సాధించిందనే అంశాన్ని ఇందులో చూస్తారు” అని చెప్పారు. సతీశ్ నాయర్ సంగీతం అందించిన ఈ తమిళ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుంది.
