NTV Telugu Site icon

Sukumar : టాలీవుడ్ లో సుకుమార్ శిష్యుల దండయాత్ర..

Sukumar

Sukumar

Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సుకుమార్ శిష్యుల దండయాత్ర కొనసాగుతోంది. సుకుమార్ దగ్గర క్లాసులు తీసుకున్న వారు ఇప్పుడు టాలీవుడ్ ను ఊపేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓ ముగ్గురు మాత్రం సెన్సేషన్ అయిపోయారు. వారే బుచ్చిబాబు సాన, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు. ఈ ముగ్గురూ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. సుకుమార్ దగ్గర డైరెక్షన్ లో పాఠాలు నేర్చుకున్నారు. సుకుమార్ సినిమాను తీసే విధానాన్ని, ప్రేక్షకుల పల్స్ ను పట్టేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ముగ్గురూ ఒక్కో సినిమానే తీసి వాళ్ల సత్తా చూపించారు. బుచ్చిబాబు తీసిన ఉప్పెన సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించింది. కొత్త నటీనటులతో తీసి ఔరా అనిపించుకున్నాడు.

Read Also : Zelenskyy: ‘‘త్వరలో పుతిన్ చనిపోతారు’’.. జెలెన్స్కీ సంచలన ప్రకటన..

ఆయన తీసిన విధానం, డైలాగులు, పాత్రల పర్ఫార్మెన్స్ ఒకరకంగా సుకుమార్ ను చూపించాయి. శ్రీకాంత్ ఓదెల కూడా తన మొదటి సినిమా దసరాతో దుమ్మలేపాడు. బాగా ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా తీసి అతను కూడా వంద కోట్ల మార్క్ అందుకున్నాడు. అటు కార్తీక్ దండు కూడా అంతే. తన మొదటి సినిమా విరూపాక్షతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఇలా ముగ్గురూ మొదటి సినిమాతోనే వంద కోట్ల మార్క్ దాటేశారు. ఇప్పుడు రెండో సినిమాను అంతకు మించి అన్నట్టే తీస్తున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్‌ హీరోగా వస్తున్న పెద్ది సినిమా ఫస్ట్ లుక్ ఈరోజే విడుదలైంది. ఆ లుక్ చూసే ఇండస్ట్రీ షాక్ అయిపోయింది.

రామ్ చరణ్‌ ను ఇంత రగ్డ్ లుక్ లో ఇప్పటి వరకు ఎవరూ చూపించలేదు. ఒక్క దెబ్బతో మూవీపై హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. అటు శ్రీకాంత్ ఓదెల మరోసారి నానితో ప్యారడైజ్ మూవీ తీస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇండస్ట్రీని దిమ్మతిరిగేలా చేసింది. నాని గెటప్, లుక్, కథ అంతా డిఫరెంట్ గా ఉంది. ఏదో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్టు అనిపిస్తోంది. పైగా నాని చేతి మీద లం… కొడుకు అని రాసిఉండటం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

అటు కార్తీక్ దండు తన రెండో సినిమాను నాగచైతన్యతో తీస్తున్నాడు. ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇలా ఈ ముగ్గురూ సుకుమార్ దగ్గర నేర్చుకున్న పాఠాలతో ఇండస్ట్రీని ఏలేలా కనిపిస్తున్నారు. గురువును మించే శిష్యులు అయినా ఆశ్చర్యపోనవసరం లేదేమో. ఈ ముగ్గురు శిష్యుల సినిమాలకు సుకుమార్ సపోర్టు ఫుల్ గా ఉంటుంది. పైగా ఆయన కో ప్రొడ్యూసర్ గా ఉంటున్నాడు వీరి సినిమాలకు. ఎంతైనా సుకుమార్ క్లాసులు చెబితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది.