టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఎప్పుడూ ట్రెండ్‌కు తగ్గట్టు కాకుండా, తనకిష్టమైన విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో ముందుంటారు. ఇప్పుడు ఆయన నటించిన కొత్త సినిమా “జటాధర” ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్, దైవిక అంశాల ట్రెండ్ నడుస్తున్న సమయంలో కూడా, సుధీర్ మాత్రం ఈ కథను ట్రెండ్ కోసం కాకుండా, కంటెంట్ బలం కోసం ఎంచుకున్నానంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో సుధీర్ మాట్లాడుతూ.. “ఇప్పుడున్న ట్రెండ్ రెండేళ్ల తర్వాత ఉంటుందో లేదో చెప్పలేం. అందుకే నేను ట్రెండ్ దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయను. ‘జటాధర’ కథలో దైవిక అంశాలు, ఆత్మల అన్వేషణ, కుటుంబ భావోద్వేగాలు అన్నీ ఉంటాయి. అరుణాచలం ప్రస్తావన కూడా ఉంటుంది. ఈ కథలో ఉన్న సంఘర్షణకు, కొన్ని ప్రశ్నలకు మన పురాణాల్లోనే సమాధానాలు దొరుకుతాయి. నేను చేసే పాత్ర ఆత్మల్ని వెతికే వ్యక్తిది, కానీ దేవుడిపైనే ఎక్కువ నమ్మకం ఉంచే వ్యక్తి. అదే ఈ కథలోని అసలు ట్విస్ట్” అన్నారు.
వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..“బ్యాంకులు లేని కాలంలో ధనాన్ని భూమిలో పాతిపెట్టి, దానికి పిశాచిని కాపలాగా పెట్టడంలాంటి కథలు మనం విన్నాం. అలాంటి పాత జానపదం ఆధారంగా తీశాము” అని సుధీర్ వివరించారు. అలాగే తన కెరీర్ గురించి మాట్లాడిన సుధీర్ బాబు.. “నా తొలి సినిమా ‘SMS’ చేసినప్పుడు ఇంత దూరం వస్తానని అనుకోలేదు. ప్రతి పాత్ర కోసం వంద శాతం కష్టపడ్డా. హిందీ సినిమా ‘బాఘీ’ చేసిన తర్వాత కూడా నా దృష్టి ఎప్పుడూ తెలుగు సినిమాలపైనే ఉంది” అన్నారు. ఇక తన నెక్స్ట్ మూవీ గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు “తదుపరి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తా. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎవ్వరూ చేయని కాన్సెప్ట్‌తో అది రూపొందుతోంది. అది ఒక ‘బాహుబలి’ తరహాలో తీస్తున్నాం. అదీకాక, పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా ప్లాన్‌లో ఉంది” అని తెలిపారు. ఇక ప్రజంట్ సుధీర్ బాబు మాటులు వైరల్ అవుతుండగా.. ఆయన చెప్పిన “బాహుబలి రేంజ్” సినిమా గురించి మాత్రం ఇప్పటికే అభిమానుల్లో హైప్ ఆరంభమైంది.
