‘శ్రీరస్తు… శుభమస్తు…’ అన్న పదాలు మనవాళ్ళకు మహదానందం కలిగిస్తాయి. ముఖ్యంగా శుభలేఖల్లోనూ ఈ పదాలు ప్రధానస్థానం ఆక్రమిస్తుంటాయి. శుభకార్యాల్లోనూ ఈ పదాలే జనానికి ఆనందం పంచుతూ ఉంటాయి. ‘శ్రీరస్తు-శుభమస్తు’ టైటిల్ తో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం 1981 సెప్టెంబర్ 26న విడుదలయింది. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యువతను అప్పట్లో ఆకట్టుకుంది. ఇదే టైటిల్ తో ఈ మధ్య చిరంజీవి మేనల్లుడు అల్లు శిరీష్ హీరోగా ఓ చిత్రం రూపొందింది.
‘శ్రీరస్తు-శుభమస్తు’ కథలో కృష్ణ, కాళిదాస్ మంచి మిత్రులు. కృష్ణకు ఆడదంటే ఆటవస్తువు. దాసు అందుకు విరుద్ధం స్త్రీని పూజించాలి, గౌరవించాలి అంటూ ఉంటాడు. కాళిదాస్ కు దేవి అనే అమ్మాయి అంటే ఆరాధన. అదే అమ్మాయిని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటానని సవాల్ చేస్తాడు కృష్ణ. దేవిని నమ్మించి మోసం చేస్తాడు. మరోవైపు మేనమామ కూతురు సుందరితో రొమాన్స్ చేస్తుంటాడు కృష్ణ. అయితే దేవి మాత్రం కృష్ణ ఉండే ఆఫీసుకు వెళ్ళి తానే ఆయన భార్యనని చెబుతుంది. అంతటితో ఆగకుండా కృష్ణ ఉండే గదికి వెళ్ళి, భార్యగా కాపురం చేస్తానంటుంది. మేనమామకు అసలు విషయం తెలిసి కృష్ణను గెంటేస్తాడు. దాంతో ఊరుకోకుండా మరో ధనవంతుని కూతురు కల్పనకు గేలం వేస్తాడు కృష్ణ. పెళ్ళి చేసుకోవాలనకుంటాడు. అయితే కల్పన తెలివిగా మరో అమ్మాయిని పీటల మీదకు పంపుతుంది. అది చూసి అగ్గిమీద గుగ్గిలమవుతాడు కృష్ణ. తరువాత కృష్ణ ఉద్యోగం పోతుంది. వీధిన పడతాడు. ఆ సమయంలో దేవి ఆదుకోవాలని వస్తుంది. తిరస్కరిస్తాడు. చివరకు పశ్చాత్తాపం చెంది, దేవిని కృష్ణ ఆదరించడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన సరిత, కవిత నాయికలు కాగా, నూతన్ ప్రసాద్, సువర్ణ, అత్తిలి లక్ష్మి, పి.ఎల్.నారాయణ, జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి, చిట్టిబాబు, రమణమూర్తి, ప్రభాకర్ రెడ్డి నటించారు. ఈ చిత్రానికి వీటూరి మాటలు, వేటూరి పాటలు, జె.వి.రాఘవులు సంగీతం సమకూర్చారు. శ్రీ ఆలయమ్మన్ క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఇందులోని “శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికీ… కళ్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి…” సాంగ్ బాగా ఆకట్టుకుంది. “కోమలాంగి వచ్చిందిరో…మెచ్చిందిరో.. నచ్చిందిరో…”, “శ్రీదేవి నా దేవి కరుణ చూపవా…”, “నవ్విస్తాడే కవ్విస్తాడే మురిపాలెన్నో కురిపిస్తాడే…” పాటలు కూడా అలరించాయి. అంతకు ముందు ‘న్యాయం కావాలి’, ’47 రోజులు’ వంటి చిత్రాలలో హీరోయిన్ ను మోసం చేసే పాత్రల్లో నటించిన చిరంజీవితో మరోమారు అలాంటి పాత్రలోనే చూపింది ఈ చిత్రం.
