పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలకే మొగ్గు చూపుతారు. బ్లాక్ బస్టర్ ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన శ్రీనిధి శెట్టి కూడా టాలీవుడ్లో గ్లామరస్ ఎంట్రీ ఇస్తుందని అందరూ భావించారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా, ఏకంగా ఓ ‘తల్లి’ పాత్రలో కనిపించనుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’లో ఆమె పాత్ర చుట్టూనే కీలకమైన మలుపులు ఉంటాయట.
ఈ సినిమాలో ఆమె కేవలం తల్లిగానే కాకుండా.. చిట్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టుబడిగా పెట్టి, మోసపోయి, అప్పుల పాలయ్యే ఓ మిడిల్ క్లాస్ మహిళగా డీ గ్లామరైజ్డ్ రోల్లో కనిపించనుంది. తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఇలాంటి పాత్ర చేయడం రిస్క్ అనిపించలేదా అన్న ప్రశ్నకు శ్రీనిధి తాజా ప్రమోషన్స్ లో ఎంతో మెచ్యూర్డ్‌గా బదులిచ్చింది. “త్రివిక్రమ్, వెంకటేష్ లాంటి లెజెండ్స్ కాంబినేషన్లో వచ్చే ఇలాంటి సినిమాలు అరుదుగా ఉంటాయి. ఇది అమ్మ పాత్ర అని తెలిసినా నాకు ఒక్క క్షణం కూడా ఆలోచించాలనే భావన రాలేదు, వెంటనే ఓకే చెప్పేశా. కేవలం కంటెంట్ బలంగా ఉన్న పాత్రలు చేయడమే నాకిష్టం” అంటూ తన కాన్ఫిడెన్స్‌ను బయటపెట్టింది.

