NTV Telugu Site icon

65 ఏళ్ళ ‘తోడికోడళ్ళు’

తెలుగు చలనచిత్రసీమలో మరపురాని చిత్రాలను అందించిన అరుదైన సంస్థల్లో ‘అన్నపూర్ణ పిక్చర్స్’ స్థానం ప్రత్యేకమైనది. తమ తొలి చిత్రం ‘దొంగరాముడు’తోనే ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించిన ‘అన్నపూర్ణ’ సంస్థ నిర్మించిన రెండవ సినిమా ‘తోడికోడళ్ళు’. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. అక్కినేనితో ఆదుర్తి తెరకెక్కించిన తొలి చిత్రమిదే. ఈ సినిమా ఘనవిజయం తరువాత ఏయన్నార్, ఆదుర్తి కాంబినేషన్ లో అనేక జనరంజక చిత్రాలు రూపొందాయి. 1957 జనవరి 11న ‘తోడికోడళ్ళు’ చిత్రం విడుదలయి, ఘనవిజయం సాధించింది.

‘తోడికోడళ్ళు’ టైటిల్ లోనే ఇది ఓ కుటుంబంలో జరిగే తోడికోడళ్ళ కథ అని ఇట్టే తెలిసిపోతోంది. ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రాసిన ‘నిష్కృతి’ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు ముందు ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ‘అమరసందేశం’ అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో తనకు వచ్చిన ఎడిటింగ్ పనిలోనే సాగుతున్నారు ఆదుర్తి. అయితే అతని పనితనం తెలిసిన మిత్రులు ‘అన్నపూర్ణ’ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుకు ఆయన గురించి చెప్పారు. పైగా, ఆ సమయంలో దుక్కిపాటి కోరుకున్న కేవీ రెడ్డి సైతం ‘మాయాబజార్’ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. దాంతో తనకు నచ్చిన ‘నిష్కృతి’ కథను తెరకెక్కించమని ఆదుర్తిని పిలిచారు. అలా ‘తోడికోడళ్ళు’కు బీజం పడింది.

ఈ చిత్రంలో ఏయన్నార్, సావిత్రి జంటగా నటించగా, మిగిలిన పాత్రల్లో ఎస్వీ రంగారావు, కన్నాంబ, రేలంగి, సూర్యకాంతం, జగ్గయ్య, రాజసులోచన, అల్లు రామలింగయ్య, మాస్టర్ శరత్ బాబు, మాస్టర్ కుందు నటించారు. ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు, ఆచార్య ఆత్రేయతో కలసి దుక్కిపాటి స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఈ సినిమాకు ఆచార్య ఆత్రేయ మాటలు రాశారు. కొసరాజు, శ్రీశ్రీ, ఆత్రేయ, తాపీ పాటలు పలికించారు. మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ అప్పట్లో ఈ సినిమాకు రికార్డిస్ట్ గా పనిచేశారు. ఈ సినిమా పేరు గుర్తుకు రాగానే ముందుగా గుర్తుకు వచ్చే పాట – “ఆడుతు పాడుతు పనిచేస్తుంటే…” అన్నదే. ఈ పాటను కొసరాజు రాశారు. “టౌను పక్కకెళ్ళొద్దురో…”, “నీ షోకు చూడకుండ…”, “గాలిపటం గాలిపటం…” పాటలను కూడా కొసరాజు కలం పలికించింది. “కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడీచానా…”, “శ్రీరస్తు శుభమస్తు…”, “ఎంతెంత దూరం…” పాటను ఆత్రేయ రాశారు. “నలుగురు కలసి…”, “భలే మావయ్య…” పాటను శ్రీశ్రీ అందించారు. “కలకాలం ఈ కలతే…” అనే పాటను తాపీ ధర్మారావు రచించారు. ఆ రోజుల్లో ‘తోడికోడళ్ళు’ పాటలు విశేషాదరణ చూరగొన్నాయి.

‘తోడికోడళ్ళు’ చిత్రం అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ఆ యేడాది వసూళ్ల వర్షం కురిపించిన చిత్రాలలో ఒకటిగా నిలచింది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది. ఈ సినిమాను తమిళంలోనూ ఏయన్నార్ హీరోగానే ఆదుర్తి దర్శకత్వంలో రూపొందించారు దుక్కిపాటి. తమిళంలో ‘ఎంగల్ వీట్టు మహాలక్ష్మి’గా ఈ చిత్రం జయకేతనం ఎగురవేసింది. అప్పటి నుంచీ అన్నపూర్ణ సంస్థ ఏయన్నార్ తో తాము నిర్మించిన అనేక చిత్రాలను తెలుగుతో పాటు, తమిళంలోనూ తెరకెక్కించి విజయాలు చూసింది. ఈ చిత్రం ఇప్పటికీ బుల్లితెరపై అలరిస్తూనే ఉంది. ‘తోడికోడళ్ళు’ చూస్తే, ఆ సినిమా స్ఫూర్తితో ఎన్ని తెలుగు చిత్రాలు రూపొందాయో అర్థమవుతుంది.