Site icon NTV Telugu

Sri Devi : యమహో నీ యమా యమా అందం… శ్రీదేవి!

Sridevi

Sridevi

‘అందానికి అందం’లా ఉండే శ్రీదేవిని చూస్తే కాసింత కళాపోషణ ఉన్న ఎవరికైనా కవిత్వం తన్నుకు వస్తుంది. ఇక చేయి తిరిగిన గీత రచయితల గురించి వేరే చెప్పాలా!? ఒకరు “యమహో… నీ యమా యమా అందం…” అని కీర్తిస్తే, మరొకరు “అసలు భూలోకం ఇలాంటి సిరి చూసివుంటదా?” అనీ ప్రశ్నించారు. ఇలా అందంతో జేజేలు అందుకున్న శ్రీదేవి ‘అతిలోకసుందరి’గా జనం మదిలో నిలిచారు.

శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడు శివకాశిలోని మీనంపట్టిలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. నాలుగేళ్ళ ప్రాయంలోనే ‘కందన్ కరుణై’ చిత్రంలో నటించి, తొలిసారి తెరపై తళుక్కుమన్నారు శ్రీదేవి. బాలనటిగానే పలు చిత్రాలలో భళా అనిపించిన శ్రీదేవి ఆపై నాయికగానూ విశేషంగా అలరించారు. బాలనటిగా నటించి, తరువాత నాయికలుగానూ అలరించినవారు ఎందరో ఉన్నారు. కానీ, వారందరికంటే భిన్నంగా శ్రీదేవి నటజీవతం సాగింది. అందుకే శ్రీదేవి అంటే ఓ అద్భుతం అని అంటారు అభిమానులు. ఇంతకూ శ్రీదేవి ప్రత్యేకత ఏమిటంటే –
ఎవరి సరసనైతే తాను మనవరాలుగా, కూతురుగా, చెల్లెలుగా నటించిందో సదరు హీరోలతోనే నాయికగానూ శ్రీదేవి మురిపించడం అరుదైన విషయమే! శ్రీదేవి ఎన్ని భాషల్లో నటించినా, ఆమెకు తారాపథం చూపించిన ఘనత తెలుగువారిదే.

శ్రీదేవి నంబర్ వన్ నాయికగా ఆసేతు హిమాచల పర్యంతం అలరించారు. అంతటి స్థానం శ్రీదేవికి లభించడానికి కారణం, బాలనటిగా ఆమె మురిపించిన వైనం. అందాలభామగా అలరించిన తీరు కారణమని చెప్పక తప్పదు. ‘బడిపంతులు’లో మహానటుడు యన్టీఆర్ కు మనవరాలుగా నటించి, ఆ తరువాత ఆయన సరసనే ‘వేటగాడు’తో నాయికగా మురిపించింది. పైగా ఆ ‘వేటగాడు’తోనే శ్రీదేవికి స్టార్ హీరోయిన్ అన్న గుర్తింపు లభించింది. ఇలాంటి జిమ్మిక్ బహుశా తెలుగునాట ఎవరూ చేసి ఉండరు. అక్కడితో ఆగిపోతే, ఆమె శ్రీదేవి ఎందుకవుతుంది? వరుసగా నాలుగేళ్ళు యన్టీఆర్ తో బ్లాక్ బస్టర్స్ చూసి, ఓ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇలాంటి రికార్డు తెలుగునాట మరే తారకూ కనిపించదు. 1979లో ‘వేటగాడు’, 1980లో ‘సర్దార్ పాపారాయుడు’, 1981లో ‘గజదొంగ’, ‘కొండవీటి సింహం’, 1982లో ‘జస్టిస్ చౌదరి’, ‘బొబ్బిలిపులి’- ఇలా రామారావుతో శ్రీదేవి సిల్వర్ జూబ్లీస్, గోల్డెన్ జూబ్లీస్, డైమండ్ జూబ్లీ చూశారు. యన్టీఆర్-శ్రీదేవి జంటలాగా అలరించిన మరో హిట్ పెయిర్ కూడా మనకు కానరాదు.

ఏయన్నార్ తో ‘ప్రేమాభిషేకం’ వంటి బ్లాక్ బస్టర్ చూశారు శ్రీదేవి. తెలుగునాట తొలి ప్లాటినమ్ జూబ్లీగా నిలచిందీ చిత్రం. శోభన్ బాబుతో ‘ఇల్లాలు’, ‘దేవత’, కృష్ణతో ‘కిరాయి కోటిగాడు, వజ్రాయుధం’, కృష్ణంరాజుతో ‘పులిబిడ్డ, త్రిశూలం’ వంటి విజయాలనూ చవిచూశారు శ్రీదేవి. ఇక తరువాతి తరం హీరోలు చిరంజీవితో ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’, నాగార్జునతో ‘ఆఖరి పోరాటం’, వెంకటేశ్ తో ‘క్షణక్షణం’ చిత్రాల్లో నటించి అలరించారు. ఉత్తరాదిన సైతం మూడు తరాల హీరోలతో శ్రీదేవి నటించి తన అందచందాలతో మురిపించారు. అక్కడా శ్రీదేవి అరుదైన విజయాలను చవిచూడటమే కాదు, అపూర్వంగా చరిత్ర లిఖించారు. అయితే అందరూ ఆమెలోని అందానికే పెద్ద పీట వేశారు. కానీ, శ్రీదేవికి వీరాభిమానిని అని చెప్పుకొనే రామ్ గోపాల్ వర్మ తన ‘క్షణ క్షణం’లో శ్రీదేవితో ఓ వైవిధ్యమైన పాత్రను పోషింప చేశారు. ఈ చిత్రం ద్వారా శ్రీదేవికి ఉత్తమనటిగా నంది అవార్డు లభించింది.

వివాహం అయిన తరువాత కొన్నాళ్ళు కెమెరాకు దూరంగా ఉన్న శ్రీదేవి మళ్లీ ‘ఇంగ్లిష్ వింగ్లిష్’తో జనం ముందు నిలచింది. తరువాత ‘మామ్’గా నటించి మెప్పించారామె. ఆ సినిమాతో శ్రీదేవికి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు లభించింది. 2013లో శ్రీదేవికి పద్మశ్రీ అవార్డు దక్కింది. దేశం కాని దేశంలో శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న అనుమానస్పద రీతిలో కన్నుమూశారు. భౌతికంగా శ్రీదేవి మన మధ్య నేడు లేకపోయినా, ఆమె నటించిన చిత్రాలతోనే అభిమానులు ఆనందిస్తున్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా శ్రీదేవి ఓ స్పెషల్! తెలుగువారికి ఆమె మరింత ప్రత్యేకం అని చెప్పక తప్పదు

Exit mobile version