NTV Telugu Site icon

20 ఏళ్ళ ‘నువ్వు-నేను’

(ఆగస్టు 10తో ‘నువ్వు-నేను’కు 20 ఏళ్ళు)

తొలి ప్రయత్నంగా దర్శకుడు తేజ రూపొందించిన ‘చిత్రం’ అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకొని సంచలన విజయం సాధించింది. ఆ చిత్ర కథానాయకుడు ఉదయ్ కిరణ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టింది. తరువాత ఉదయ్ కిరణ్ హీరోగా తేజ రూపొందించిన చిత్రం ‘నువ్వు-నేను’. ఇందులోనూ ప్రేమకథనే తీసుకొని మరోమారు యువతను రంజింప చేస్తూ అంతకు మించిన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు తేజ. ఈ చిత్రంతో నవతరం కథానాయకుల్లో స్టార్ గా స్థానం సంపాదించారు ఉదయ్ కిరణ్. 2001 ఆగస్టు 10న విడుదలైన ‘నువ్వు-నేను’లోని ప్రేమకథ జనానికి గిలిగింతలు పెట్టింది.

‘నువ్వు-నేను’ కథ విషయానికి వస్తే, ఓ ధనవంతుల అబ్బాయికి, పాల వ్యాపారం చేసుకొనే నాటు రకం మనిషి కూతురుకి మధ్య సాగే ప్రేమకథ ఇది. ఈ రెండు పంక్తులు వినగానే రాజ్ కపూర్ రూపొందించిన ‘బాబీ’ చిత్రం గుర్తుకు వస్తుంది. అయితే ఇక్కడ ‘నువ్వు-నేను’లో ఆటలతో కాలక్షేపం చేసే అబ్బాయికి, అదే కళాశాలలో అతని క్లాస్ మేట్ పెట్టే చీవాట్లు ఆమెపై ప్రేమకలిగేలా చేస్తాయి. అబ్బాయి తండ్రి వారి ప్రేమను అంగీకరించడు. తాను తెచ్చిన కోటీశ్వరుల అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలంటాడు. అందుకు తనయుడు ఒప్పుకోడు. ప్రేమించిన అమ్మాయిని తీసుకువెళ్ళి పడరాని పాట్లు పడతారు. ఇక్కడ మళ్ళీ ‘దిల్’ గుర్తుకు రాకమానదు. చివరకు తండ్రి ధనం జులుమ్ చూపించాలనుకుంటాడు. మరోవైపు అమ్మాయి మేనత్త ఆమెను రాచిరంపాన పెడుతుంది. చివరకు విద్యార్థులంతా ఏకమై అనుకున్న ప్రకారం అసెంబ్లీ ముందు వారిద్దరి వివాహం చేయించడంతో కథ సుఖాంతమవుతుంది.

చెప్పుకోవడానికి కథ ఇంతే అయినా, తేజ కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందులో రవిగా ఉదయ్ కిరణ్, వసుంధరగా అనిత నటించారు. సునీల్, బెనర్జీ, తనికెళ్ళ భరణి, రాధికా చౌదరి, సుప్రియా కార్నిక్, వైజాగ్ ప్రసాద్, శకుంతల, రాళ్ళపల్లి, ఆహుతి ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సంగీత తదితరులు అభినయించారు. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం పెద్ద ఎస్సెట్. కులశేఖర్ పలికించిన తొమ్మిది పాటలూ ఆకట్టుకున్నాయి. “గాజువాక పిల్లా మేం గాజులోల్లం కాదా…”, “ప్రియతమా తెలుసునా…”, “అయ్యయ్యో… అయ్యయ్యో…”, “నువ్వు నేను…”, “నీ కోసమే…”, “నా గుండెలో…”, “నువ్వే నాకు ప్రాణం…”, “గున్నమావి…” పాటలు ఆదరణ పొందాయి.

‘నువ్వు-నేను’ చిత్రం ఉత్తమదర్శకునిగా తేజకు, ఉత్తమ కేరెక్టర్ యాక్టర్ గా తనికెళ్ళ భరణికి, ఉత్తమ హాస్యనటునిగా సునీల్ కు, ఉత్తమ సంగీత దర్శకునిగా ఆర్పీ పట్నాయక్ కు, ఉత్తమ ఛాయాగ్రాహకునిగా రసూల్ ఎల్లోర్ కు నంది అవార్డులు సంపాదించిపెట్టింది. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమవుతున్న సమయంలో జనం కట్టుకదలక చూస్తూనే ఉండడం కనిపిస్తూ ఉంటుంది.