NTV Telugu Site icon

హరీష్ శంకర్…ఇది అవసరమా?

Harish Shankar

Harish Shankar

ఒక సినిమా తియ్యాలంటే ఎంత కష్టమో,అది విధంగా సక్సెస్ అవ్వకపోతే ఎంత నష్టమో తెలిసిందే.అదే కష్టపడి పైకి వచ్చిన హరీష్ శంకర్ లాంటి దర్శకులకు ఈ విషయం ఇంకా బాగా తెలుసు.ఒక ప్రొడ్యూసర్ అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చి,ఒక హీరో తన ఎనర్జీ మొత్తాన్ని ధారపోసి నటించి,సాంకేతిక వర్గం తమకు అప్పగించిన పనులను ఎంతకష్టమయినా పూర్తిచేసి … ఇలా సమిష్టి కృషితో ఒక పెద్ద సినిమా అనుకున్న డేట్ కంటే ముందే రిలీజ్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదు.అయితే అదే సినిమా రిలీజ్ అయ్యి ఫెయిల్యూర్ అయితే ఎవరిది తప్పు…మామూలుగా అయితే అది ఏ ఒక్కరికో ఆపాదించడం నిజమయిన తప్పు.కానీ ‘మిస్టర్ బచ్చన్’ విషయంలో మాత్రం హరీష్ శంకర్ కార్నర్ అయ్యాడు. అది స్వయం కృతాపరాధం.

కమర్షియల్ సినిమాని కసిగా తీస్తాడు,రీమేక్ అయినా కూడా ఆ ఆనవాళ్లు లేకుండా మార్చేస్తాడు లాంటి పాజిటివ్ థ్రెడ్స్ అన్నీ కూడా ఒకే దెబ్బకు మాయం అయ్యేలా,థియేటర్ లోకి వెళ్లిన ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఈ సినిమా తీసాడు.చిన్న లాజిక్కులు కూడా మిస్ అయిపోయి ఒక దారుణమయిన ఫెయిల్యూర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.థియేటర్ లో సినిమా చూసి చప్పట్లు, విజిల్స్ కొట్టాల్సిన అభిమానులు సైతం డైరెక్టర్ కనబడితే కొడతాం అంటూ డైరెక్ట్ గా పబ్లిక్ టాక్ మైక్స్ ముందు చెబుతున్నారంటే ఏంటి అర్ధం..?.

ఈ సినిమాకి నిర్మాత TG విశ్వప్రసాద్ అన్ని రకాలుగా సపోర్ట్ గా నిలిచారు. బడ్జెట్ దగ్గరినుండి రిలీజ్ డేట్ వరకు అన్ని రకాలుగా తన పూర్తి సహకారం అందించారు. మాస్ మహారాజ రవితేజ 56 ఏళ్ళ వయసులో కూడా కెరీర్ బెస్ట్ ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్ ఇచ్చారు.మిక్కీ వారంలోనే 4 చార్ట్ బస్టర్స్ కంపోజ్ చేయగలిగారు.భాగ్య శ్రీ బోర్సే తన పరిధిమేర తెరపై అందాలు ధారబోసింది, మిగతా నటీనటులంతా కెప్టెన్ ఆఫ్ ది షిప్ చెప్పినట్టు చేసుకుంటూ పోయారు. కానీ మెయిన్ పిల్లర్ మాత్రం పూర్తిగా ఔట్ ఆఫ్ అటెన్షన్ అన్నట్టుగా స్క్రిప్ట్ ని గాలికొదిలేశారు.హిందీ పాటలు,తెలుగు పాటలు మిక్స్ చేసి ఫస్ట్ హాఫ్ వండి అక్కడికే బ్లాక్ బస్టర్ ఫీలింగ్ వచ్చి సెకండ్ హాఫ్ కి సెండ్ ఆఫ్ ఇచ్చినట్టు ఉంది సినిమా.సత్య ట్రాక్ లేకపోతే ఫస్ట్ హాఫ్ కూడా పండేది కాదు.

మచ్చుకి చెప్పుకుంటే ఇంతకుమించిన డైలాగ్స్ రాయలేం అన్నట్టు ఆయన గత సినిమాల్లో డైలాగ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసారు.విలన్ ని ఫస్ట్ సీన్ లో,లాస్ట్ సీన్ లో తప్ప ఎక్కడా సీరియస్ నెస్ లేకుండా డిజైన్ చేసారు(అదొక కొత్తదనం అనుకోవాలేమో),సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే అయితే మరీ కామెడీ(సీరియస్ సీన్స్ లో సైతం అలా అనిపిస్తుంది),ఇక అన్నపూర్ణమ్మ ట్రాక్ రాసేటప్పుడు ఏం ఆలోచించారో అని ఎంత ఆలోచించినా అంతుపట్టదు.అరువు తెచ్చుకున్న ఇతర ట్రాక్స్ సంగతి సరే సరి.1980 లో నడిచే కథకి అలాంటి స్క్రీన్ ప్లే రాసుకోవడం అంటే దాన్ని ఏమనుకోవాలి.నాలుగు సంవత్సరాలు నలిగిన తర్వాత వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులా ప్లాప్ పాలు జేసుకున్న హరీష్ శంకర్ ని చూస్తే జాలి వెయ్యకమానదు.

‘గబ్బర్ సింగ్’లో స్క్రీన్ ప్లే పరుగులు,’మిరపకాయ్’లో మాటల మెరుపులు,’గద్దలకొండ గణేష్’లో విలనిజం విరుపులు ఈ సినిమాలో పూర్తిగా మిస్సింగ్. హరీష్ శంకర్ సినిమా అంటే మినిమం ఉంటుంది కదా అనుకుంటే మాక్సిమం డిజప్పాయింట్మెంట్ తప్పలేదు
మీడియా మీట్స్ లో, ఆ ఇంటర్వూస్ లో వేసిన సెటైర్స్ లా తన డైలాగ్స్ సినిమాలో పేలలేదు.అక్కడ ఆన్సర్స్ చెప్పడానికి వాడినంత తెలివి స్క్రిప్ట్ పైన పెట్టలేదు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.హరీష్ ఎక్కువగా ఉండడానికి ఇష్టపడే ట్విట్టర్ లో సైతం ఒక పాజిటివ్ కామెంట్ ఉంటే పది నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటేనే మనిషికి భవిష్యత్తు.అలాకాకుండా పూరి సినిమా టైటిల్ లా ‘నేనింతే ‘ అనుకుంటే ఇక కెరీర్ కి కష్టాల మలుపులు తప్పవు.కొత్తవాళ్ళయినా,సీనియర్స్ అయినా వర్క్ పై ప్రాణం పెడితేనే,హిట్ కొడితేనే ఇక్కడ నిలబడతారు.అలా పడిన చోటే హరీష్ శంకర్ తిరిగి నిలబడాలని, ఈసారి తన మాటలకన్నా వర్క్ ఎక్కువగా వినబడాలని,కనబడాలని కోరుకుందాం.