NTV Telugu Site icon

50 ఏళ్ళ ‘రామాలయం’

Ramalayam

(అక్టోబర్ 22తో ‘రామాలయం’ చిత్రానికి 50 ఏళ్ళు)
మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ టాప్ స్టార్స్ గా రాజ్యమేలుతున్న రోజుల్లో వారి చిత్రాల్లో సైడ్ హీరోస్ గా నటించేవారు జగ్గయ్య, కాంతారావు. తరువాతి రోజుల్లో వారిద్దరూ సోలో హీరోస్ గా రాణించారు. తమకంటూ కొంతమంది నిర్మాతలను సంపాదించుకొన్నారు. అయితే తమకు లభించిన కేరెక్టర్ రోల్స్ ను మాత్రం జగ్గయ్య, కాంతారావు వదలుకోలేదు. అలా సాగుతూనే వారికి తగ్గ పాత్రల్లో నటించి అలరించారు. జగ్గయ్య హీరోగా రామవిజేతా ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘రామాలయం’. కె.బాబూరావు దర్శకత్వంలో కె.ఏ.ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1971 అక్టోబర్ 22న ‘రామాలయం’ జనం ముందు నిలచింది. దసరా నవరాత్రుల సమయంలోనే ఈ చిత్రం విడుదల కావడం విశేషం. భక్తకోటిని ‘రామాలయం’ భలేగా ఆకర్షించింది.

ఆ రోజుల్లో భర్త పేరుకు తగ్గట్టే భార్యల పేర్లూ ఉండేవనిపిస్తుంది. ఇందులో కథానాయకుడు రామయ్య, ఆయన భార్య జానకి. రామయ్య తమ్ముడు గోపి, అతని భార్య రాధ, వారికి ఓ చంటి పిల్లాడు. వీరితో పాటు రామయ్య చెల్లెలు చిట్టి కూడా కలసి జీవిస్తూంటుంది. వారి కుటుంబం ఎంతో అన్యోన్యంగా సాగుతూ ఉంటుంది. అన్యాయాన్ని ఎదుర్కోవడంలో గోపి ఎప్పుడూ ముందుంటాడు. ఆ ఊరి షావుకారు రాయుడు మనుషులు చేసే ఆగడాలను ఎదుర్కొంటాడు. రామయ్య కుటుంబంపై ఊడిపోయిన కరణం లింగయ్య ద్వేషం పెంచుకొని ఉంటాడు. తన తాగుడు, తందనాలతో సాగే రాయుడును తన చెప్పుడు మాటలతో చెడగొడతాడు. రామయ్య చెల్లెలును కాంతమ్మ కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. అదేపనిగా కాంతం ఇంటికి వెళ్ళి, మాజీ కరణం రామయ్యకు ఎంతో ఆస్తివుందని, అందువల్ల పదివేలకు పైసా తగ్గకుండా కట్నం తీసుకోమని చెబుతాడు. డబ్బు ఆశ ఉన్న కాంతమ్మ అలాగే చేస్తుంది. చెల్లెలి కోసం తన ఆస్తి తాకట్టు పెట్టి రాయుడు వద్ద పదివేలు తీసుకుని పెళ్ళి ఘనంగా చేస్తాడు రామయ్య. అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు వస్తాయి. గోపి ఇంట్లో అడ్డుగోడ కడతాడు. రామయ్యపై రాయుడు అప్పు కట్టమని వత్తిడి తెస్తాడు. రామయ్య చితికి పోతాడు. జానకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. తల్లి కాంతమ్మ డబ్బు పిచ్చికి ఆమె కొడుకు విరుగుడుగా పాముతో కాటు వేయించి, మందు వేసి కనువిప్పు కలిగిస్తాడు. గోపి భార్య రాధను నమ్మించి మాజీ కరణం రాయుడు దగ్గరకు తీసుకుపోతాడు. అది తెలిసిన గోపి రాయుడును చితకబాదుతాడు. అదే సమయంలో రామాలయంలో రామయ్య, జానకి కలుసుకుంటారు. రాయుడు క్షమించమని రామయ్య, జానకి కాళ్ళపై పడతాడు. దాంతో రామయ్య అతణ్ణి క్షమించమని, తమ్మునికి చెబుతాడు. అందరూ కలుసుకొని శ్రీరాముని కీర్తిస్తూ ఉండగా కథ ముగుస్తుంది.

రామయ్యగా జగ్గయ్య, జానకిగా జమున, గోపిగా శోభన్ బాబు, రాధగా విజయనిర్మల నటించారు. ఇందులో రోజారమణి, చంద్రమోహన్, అల్లు రామలింగయ్య, ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, బాలకృష్ణ, నాగయ్య, సూర్యకాంతం ఇతర పాత్రల్లో కనిపించారు. రమణారెడ్డి పాములవాడిగా కాసేపు తళుక్కుమన్నారు. ఈ చిత్రానికి దర్శకుడు బాబూరావు కథ సమకూర్చగా, పినిశెట్టి మాటలు రాశారు. ఈ చిత్రంలోని పాటలకు ఘంటసాల సంగీతం సమకూర్చగా, నేపథ్య సంగీతాన్ని ఎస్.రాజేశ్వరరావు అందించారు. దాశరథి, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, కొసరాజు పాటలు పలికించారు. ఇందులోని “జగదభిరామా…రఘుకుల సోమా…” పాట విశేషాదరణ చూరగొంది. ఈ నాటికీ శ్రీరామనవమి సమయంలో ఈ పాట ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. “చిన్నారి మరదలికి పెళ్ళవుతుంది…”, “మముగన్న తల్లిరా భూదేవి…”, “ఎందుకు బిడియము చిట్టెమ్మా…”, “ఎవరికి దొరకని ఈ అందం…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి. ఆ రోజుల్లో ‘రామాలయం’ చిత్రం మంచి ఆదరణ పొందింది. తరువాత ఇదే రామవిజేతా ఫిలిమ్స్ సంస్థ జగ్గయ్య హీరోగా ‘రామరాజ్యం’ అనే చిత్రాన్నీ నిర్మించింది. ఆ సినిమాతోనే శరత్ బాబు తెరకు పరిచయం కావడం విశేషం.