NTV Telugu Site icon

బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తున్న రాఘవ లారెన్స్!

‘కృషితో నాస్తి దుర్భిక్షమ్’ అన్న మాటలు కొందరి విషయంలో తప్పకుండా గుర్తుచేసుకోవాలనిపిస్తుంది. డాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు అయిన రాఘవ లారెన్స్ కెరీర్ ను చూసినప్పుడు తప్పకుండా ఆ మాటలు గుర్తుకు రాక మానవు. అతని కృషిని, చేరుకున్న స్థాయిని చూసిన వారెవరైనా లారెన్స్ ను కీర్తించక మానరు. నేడు ప్రముఖ నటునిగా, దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని విజయపథంలో సాగిపోతున్న లారెన్స్ ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.

లారెన్స్ 1976 అక్టోబర్ 29న చెన్నైలోని రాయపురంలో జన్మించారు. చిన్నతనం నుంచీ అనారోగ్యం అతణ్ణి వెంటాడింది. బ్రెయిన్ లో ట్యూమర్ కారణంగా రెండు కాళ్ళు చచ్చు పడిపోయాయి. ఆయన తల్లి, ఎందరో దేవుళ్ళను మొక్కుకున్నారు. రాఘవేంద్రస్వామి గుడిని సందర్శించిన తరువాత లారెన్స్ ఆరోగ్యం మెరుగుపడ సాగింది. ఆపరేషన్ చేస్తే కానీ బతకడని చెప్పిన డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయేలా లారెన్స్ మెదడులోని ట్యూమర్ కరిగిపోయింది. అతని రెండు కాళ్ళూ బలం చేకూరి నడవడం మొదలెట్టడం చూసి అందరూ ‘అదో అద్భుతం’ అన్నారు. శ్రీరాఘవేంద్రస్వామి తనను కరుణించాడని ఆ తల్లి మనసు పులకించిపోయింది. లారెన్స్ తన పేరుకు ముందు ఆ స్వామి పేరును ‘రాఘవ’ అని పెట్టుకున్నారు. అప్పటి నుంచీ రాఘవ లారెన్స్ గా మారిపోయారు. అయితే అందరూ అతణ్ణి లారెన్స్ అనే పిలిచేవారు. ప్రముఖ ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్‌ వద్ద కారు క్లీనర్ గా పనిచేశాడు లారెన్స్. తరువాత అతను డాన్సులు చేసే తీరు చూసి రజనీకాంత్ ముచ్చటపడ్డారు. అతనికి డాన్సర్స్ యూనియన్ లో మెంబర్ షిప్ ఇప్పించారు. అప్పటి నుంచీ లారెన్స్ పలువురు ప్రముఖ నృత్య దర్శకుల వద్ద పనిచేశారు. గ్రూప్ డాన్సుల్లో తరచూ కనిపించేవారు. సుందరం మాస్టర్, ప్రభుదేవా కంపోజ్ చేసిన పలు చిత్రాలలో లారెన్స్ డాన్సర్ గా పనిచేశారు. ‘ముఠామేస్త్రీ’ సినిమా షూటింగ్ లో “ఈ పేటకు నేనే మేస్త్రి…” పాట చిత్రీకరణలో లారెన్స్ లోని ఈజ్ ను చూసి, అతణ్ణి ముందు వరుసలో నిలచి డాన్స్ చేయమని చిరంజీవి చెప్పారు. అలా లారెన్స్ కు తొలిసారి ముందువరుసలో చిందేసే అవకాశం లభించింది. అప్పటి నుంచీ డాన్స్ మాస్టర్స్ సైతం అతనికి ప్రాధాన్యమివ్వసాగారు. కొందరు నృత్య దర్శకులు లారెన్స్ తోనే కంపోజ్ చేయించేవారు.

తెలుగులో జయసుధ ప్రధాన పాత్ర పోషించిన ‘ఆంటీ’ సినిమాలో “డింబ డింబరో…” పాటలో లారెన్స్ చేసిన డాన్స్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ తరువాత నుంచీ స్పెషల్ సాంగ్స్ లో లారెన్స్ కు చిందేసే అవకాశాలు లభించాయి. ‘ఆంటీ’ నిర్మించిన టి.వి.డి.ప్రసాద్ తరువాత తీసిన ‘పెళ్ళాల రాజ్యం’కు కూడా లారెన్స్ ను కొరియోగ్రాపర్ గా ఎంచుకున్నారు. లారెన్స్ లోని స్పీడును చూసి అదే టి.వి.డి. ప్రసాద్ అతణ్ణి హీరోగా పరిచయం చేస్తూ ‘స్పీడ్ డాన్సర్’ మూవీని నిర్మించారు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది.

అయితే లారెన్స్ కు మాత్రం కొరియోగ్రాఫర్ గా మంచి అవకాశాలు లభించాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి టాప్ స్టార్స్ అందరి చిత్రాలకు లారెన్స్ తన కొరియోగ్రఫీతో ఎంతగానో అలరించారు. ఆ సమయంలో కొన్ని చిత్రాలలో అలా తెరపై తళుక్కు మంటూ సాగారు లారెన్స్. అప్పుడే అతని మనసులో డైరెక్షన్ పై గాలి మల్లింది. అప్పటికే ఎంతోమంది ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించిన నాగార్జునను కలిసి ‘మాస్’ కథ వినిపించారు లారెన్స్ . ఆ కథ నాగ్ కు నచ్చడం, అందులో ఆయనే హీరోగా నటించి, నిర్మించడం జరిగిపోయాయి. లారెన్స్ కోరుకున్న విధంగా దర్శకుడయ్యారు. ‘మాస్’ ఘనవిజయంతో దర్శకునిగా లారెన్స్ కు మంచి పేరు లభించింది. తరువాత లారెన్స్ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ ‘స్టైల్’ నిర్మించారు. అందులో రాఘవపై అభిమానంతో చిరంజీవి, నాగార్జున, స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఒకప్పుడు తన గ్రూప్ లో డాన్సర్ గా పనిచేసిన లారెన్స్ డైరెక్షన్ లో నటించడానికి ప్రభుదేవా సైతం అంగీకరించారు. అలా రూపొందిన ‘స్టైల్’ మంచి పేరే సంపాదించి పెట్టింది. ఆ తరువాత తమిళంలో దెయ్యం కథతో ‘ముని’ రూపొందించారు రాఘవ లారెన్స్. అది పెద్ద హిట్. ఆపై నాగ్ తో ‘డాన్’ తీస్తే అదీ ఆకట్టుకుంది. తమిళంలో ‘ముని’ సీక్వెల్ గా తెరకెక్కించిన ‘కాంచన’ బంపర్ హిట్ కావడంతో రాఘవ పేరు దర్శకునిగా మారుమోగి పోయింది. కృష్ణంరాజు, ప్రభాస్ తో రాఘవ లారెన్స్ రూపొందించిన ‘రెబల్’ అంతగా ఆకట్టుకోలేక పోయింది. తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “కాంచన-2, కాంచన-3” కూడా భలేగా వినోదం పంచాయి. ‘కాంచన’ రీమేక్ గా హిందీలో ‘లక్ష్మి’ రూపొందించారు. ఇదే లారెన్స్ కు దర్శకునిగా తొలి హిందీ చిత్రం. అది అంతగా అలరించలేకపోయింది. ప్రస్తుతం ‘రుద్రం’, ‘అధిగారం’, ‘దుర్గ’ అనే చిత్రాలలో నటిస్తున్నారు రాఘవ.

తన కెరీర్ లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ కోరుకున్న స్థానం చేరుకున్న రాఘవ లారెన్స్ తన చుట్టూ ఉన్నవారికి చేతనైన సాయం చేస్తూ ముందుకు పోతున్నారు. తమిళనాట వరదల సమయంలో రాఘవ తన వంతు సాయం అందించారు. ఇక చిత్రసీమలో ఒకప్పుడు బాగా రాణించి, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికీ లారెన్స్ చేతనైన సాయం చేస్తూ ఉంటారు. తమిళనాట సంప్రదాయ క్రీడగా సాగుతున్న
‘జెల్లికట్టు’ను నిషేధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే సాగింది. ఆ సమయంలో ఆ ఉద్యమంలో పాల్గొన్నవారికి ఆహారం అందించి, ఆదుకున్నారు రాఘవ లారెన్స్. ఇలా తనకు చేతనైనా సాయం అందిస్తూనే రాఘవ తెరపై తనదైన బాణీ పలికిస్తున్నారు. రాబోయే చిత్రాలలో రాఘవ లారెన్స్ ఏ తీరున అలరిస్తారో చూడాలి.