(ఆగస్టు 1న తాప్సీ పన్ను పుట్టినరోజు)
తెలుగు చిత్రం ‘ఝుమ్మంది నాదం’తోనే వెండితెరపై తొలిసారి వెలిగింది తాప్సీ పన్ను. తరువాత మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించినా, ఉత్తరాదికి వెళ్ళాకనే ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది. దక్షిణాది చిత్రాలలో గ్లామర్ నే ఎక్కువగా ఆరాధిస్తారని అప్పట్లో కామెంట్ చేసి, తరువాత నాలుక్కరచుకుంది. ఏమైనా ప్రస్తుతం తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న తాప్సీ బాలీవుడ్ లో భలేగా సాగుతోంది. ప్రస్తుతం ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే తెలుగు చిత్రంలో తాప్సీ నటిస్తోంది.
తాప్సీ పన్ను ఆరంభంలోనే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఝుమ్మంది నాదం’లో నటించింది. దర్శకేంద్రుని చిత్రంలో నటించడం వల్ల అందం, చందంతో ఆకట్టుకుంది. ఆ చిత్రంలో మంచు మనోజ్ కథానాయకుడు. కాగా, తరువాత ‘వస్తాడు నా రాజు’లో మంచు విష్ణుతో జోడీ కట్టింది తాప్సీ. ప్రభాస్ తో ‘మిస్టర్ పర్ఫెక్ట్’లోనూ, రవితేజతో ‘వీర, దరువు’ చిత్రాల్లోనూ సందడి చేసింది. మంచు లక్ష్మి నిర్మించి, నటించిన ‘గుండెల్లో గోదారి’లోనూ తాప్సీ నటించింది. అలా మంచువారి కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పరచుకుంది తాప్సీ. అ బంధంతోనే మంచు లక్ష్మి నిర్మించిన ‘దొంగాట’లోనూ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. వెంకటేశ్ తో నటించిన ‘షాడో’, గోపీచంద్ తో జోడీ కట్టిన ‘సాహసం’ పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ఆ తరువాత 2016లో అమితాబ్ బచ్చన్ తో కలసి తాప్సీ నటించిన ‘పింక్’ చిత్రం మంచి విజయం సాధించి, ఉత్తరాదిన ఆమెకు గుర్తింపు సంపాదించి పెట్టింది. ఇదే చిత్రం ఈ మధ్య పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’గా రీమేక్ అయింది. రానా నటించిన ‘ద ఘాజీ ఎటాక్’లోనూ తాప్సీ నటించింది.
హిందీలో తాప్సీ నటించిన “నామ్ షబానా, ముల్క్, బద్లా, మిషన్ మంగళ్, సాండ్ కీ ఆంఖే” వంటి చిత్రాలు అలరించాయి. ప్రస్తుతం తాప్సీ నటించిన అరడజనుకు పైగా సినిమాలు విడుదల కావలసి ఉన్నాయి. వాటిలో “రష్మీ రాకెట్, లూప్ లపేటా, దుబారా, శభాస్ మితు, బ్లర్” వంటి హిందీ చిత్రాలున్నాయి. తమిళంలో ఆమె నటించిన “అన్నబెల్లి సుబ్రమణియమ్, జన గణ మన, ఏలియెన్” చిత్రాలు కూడా ముస్తాబవుతూ ఉన్నాయి. తాప్సీ నటిస్తున్న ఒకే ఒక్క తెలుగు చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’ షూటింగ్ జరుపుకుంటోంది.