(జూలై 23న కోడి రామకృష్ణ జయంతి)
నెత్తిన తెల్లని కట్టు, నుదుటన ఎర్రని బొట్టు, తాయెత్తులతో నిండిన మణికట్టు, వేళ్ళ నిండా ఉంగరాలు, చిరునవ్వు చెరగని ముఖంతో మెగాఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేసిన కోడి రామకృష్ణను ఎవరు మాత్రం మరచిపోగలరు? గురువు దాసరి నారాయణరావు లాగే వైట్ అండ్ వైట్ లో కనిపించే రామకృష్ణ, ఆయనకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. దాసరి, కోడి ఇద్దరిదీ పాలకొల్లు. దాసరి చిత్రసీమలో అడుగు పెట్టిన కొన్నాళ్ళకే ఆయన వద్ద అసోసియేట్ గా చేరిపోయారు కోడి. పలు చిత్రాలకు పనిచేసిన తరువాత గురువును దర్శకుణ్ణి చేసిన నిర్మాత కె.రాఘవ చలువతోనే ‘ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్ణయ్య’తో కోడి కూడా దర్శకుడై పోయారు.
తొలి చిత్రంతోనే స్వర్ణోత్సవం చూసిన కోడి రామకృష్ణ ఆ తరువాత పలు గోల్డెన్ జూబ్లీస్ తో పరవశింప చేశారు. తెలుగు చిత్రసీమలో అత్యధిక ‘గోల్డెన్ జూబ్లీస్’ గల డైరెక్టర్ గా పేరొందారు. మన దేశంలో వంద కుటుంబ కథా చిత్రాలు రూపొందించిన తొలి దర్శకునిగా దాసరి నారాయణరావు చరిత్ర సృష్టించారు. తరువాత మరో నలభైకి పైగా చిత్రాలతో దాసరి సాగిపోయారు. కోడి రామకృష్ణ సైతం శతాధిక చిత్ర దర్శకునిగా జయకేతనం ఎగురవేసి, గురువుకు అసలైన శిష్యుడు అనిపించుకున్నారు.
కోడి రామకృష్ణ తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్ణయ్య’లో చిరంజీవి హీరో. ఈ సినిమా హైదరాబాద్ లో 511 రోజులు ప్రదర్శితమయింది. ఆ తరువాత కె.రాఘవ నిర్మాతగానే ‘తరంగిణి’ చిత్రం రూపొందించారు కోడి. సుమన్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా స్వర్ణోత్సవం చూసింది. వచ్చీ రాగానే రెండు స్వర్ణోత్సవాలు చూసిన కోడి రామకృష్ణతో సినిమాలు తీయడానికి నిర్మాతలు పరుగులు తీశారు.
కోడి దర్శకత్వం వహిస్తే చాలు, తమ సినిమాకు ఢోకా ఉండదని ఎందరో నిర్మాతలు భావించేవారు. వారి అంచనాలకు తగ్గట్టే కోడి రామకృష్ణ కూడా చిత్రాలను తెరకెక్కించేవారు.
మెచ్చిన నిర్మాతలు…
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్.గోపాల్ రెడ్డి, సుమంత్ ఆర్ట్స్ ఓనర్ ఎమ్.ఎస్.రాజు, ఎమ్.ఎస్.ఆర్ట్ మూవీస్ యజమాని శ్యామ్ ప్రసాద్ రెడ్డి వంటి ప్రముఖ నిర్మాతలు కోడిరామకృష్ణ దర్శకత్వంలోనే అపురూప చిత్రాలు అందించారు. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.గోపాల్ రెడ్డి నిర్మించిన “ముక్కు పుడక, మంగమ్మగారి మనవడు, మాపల్లెలో గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య, మువ్వగోపాలుడు, మన్నెంలో మొనగాడు, మురళీకృష్ణుడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, మధురానగరిలో, అల్లరి పిల్ల” చిత్రాలకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలన్నీ ప్రజాదరణ పొందినవే. వీటిలో సిల్వర్ జూబ్లీస్, గోల్డెన్ జూబ్లీస్, డైమండ్ జూబ్లీస్ కూడా ఉండడం విశేషం. కాగా, ఎమ్.ఎస్.రాజు నిర్మాతగా తొలి చిత్రం ‘శత్రువు’ ఆ చిత్రం మంచి విజయం సాధించింది. తరువాత కోడితో రాజు తెరకెక్కించిన ‘దేవి’ కూడా ఘనవిజయం చూసింది. ‘దేవీపుత్రుడు’ పరవాలేదనిపించింది. ఇక కోడి రామకృష్ణతో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన “తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి” చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి.
విజయపథంలో కోడి…
టాలీవుడ్ లో ఈ నాటికీ తరగని ప్రజాదరణ ఉన్న టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరికీ తొలి స్వర్ణోత్సవాలు చూపించిన ఘనత కోడి రామకృష్ణదే. చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్ణయ్య’ 511 రోజులు చూసింది. ఈ సినిమా ఉదయం ఆటలతో ఆ ఘనత సాధిస్తే, బాలయ్యతో కోడి రూపొందించిన తొలి చిత్రం ‘మంగమ్మగారి మనవడు’ 560 రోజులు మూడు ఆటలతో ప్రదర్శితమై హైదరాబాద్ లో నేటికీ రికార్డుగానే నిలచింది. చిరంజీవితో “ఆలయ శిఖరం, గూఢచారి నంబర్ వన్, సింహపురి సింహం, రిక్షావోడు, అంజి” చిత్రాలు రూపొందించారు. బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో “ముద్దుల క్రిష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, భారతంలో బాలచంద్రుడు, బాలగోపాలుడు” చిత్రాలు తెరకెక్కాయి. రాజశేఖర్ తో కోడి “తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, స్టేషన్ మాస్టర్, వింతదొంగలు” వంటి సినిమాలు అందించారు. ఈ ముగ్గురు హీరోలతోనే కాకుండా కోడి తెరకెక్కించిన “పోరాటం, 20వ శతాబ్దం, ఇంటిదొంగ, మా ఇంటికి రండి, భారత్ బంద్, మా ఆవిడ కలెక్టర్, పెళ్ళి, పెళ్ళిపందిరి, దేవుళ్ళు, పుట్టింటికి రా చెల్లి” వంటి చిత్రాలు విజయపథంలో పయనించాయి.
చిరుతో గురుశిష్యులు…
భారతదేశంలో వంద చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి దర్శకునిగా దాసరి నారాయణరావు నిలిచారు. ఆయన శిష్యులలో కోడి రామకృష్ణ సైతం నూరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. దాసరి వందో సినిమాగా ‘లంకేశ్వరుడు’ (1989) రూపొందింది. కోడి రామకృష్ణ నూరవ చిత్రంగా ‘అంజి’ (2004) తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలలోనూ చిరంజీవి కథానాయకుడు కావడం విశేషం.
బాలయ్యతో కోడి రికార్డు…
ఒకే హీరోతో నాలుగు త్రిశతదినోత్సవాలు, మూడు స్వర్ణోత్సవాలు, వాటిలో ఒకటి ప్లాటినమ్ జూబ్లీ చూసిన ఘనత బాలకృష్ణతో కలసి కోడి రామకృష్ణ సొంతం చేసుకున్నారు. వీరి కాంబోలో వచ్చిన చిత్రాలలో ‘మంగమ్మగారి మనవడు’ 560 రోజులతో ప్లాటినమ్ జూబ్లీ హిట్ గా నిలచింది. “ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య” చిత్రాలు స్వర్ణోత్సవాలు చేసుకోగా, ‘మువ్వగోపాలుడు’ త్రిశతదినోత్సవం చూసింది. ఇలాంటి రికార్డ్ తెలుగు చిత్రసీమలో ఏ దర్శకునికీ లేదు.
నటనలోనూ…
గురువు దాసరి నారాయణరావు బాటలోనే పయనిస్తూ కోడి రామకృష్ణ సైతం కొన్ని చిత్రాలలో నటించారు. ‘మా ఇంటికి రండి, ఇంటిదొంగ, మూడిళ్ళ ముచ్చట, అత్తగారూ స్వాగతం, ఆస్తి మూరెడు-ఆశ బారెడు, దొంగాట” వంటి చిత్రాలలో కోడి రామకృష్ణ నటించారు. దర్శకునిగా, నటునిగా, రచయితగా ఆకట్టుకున్న కోడి రామకృష్ణకు 2012 సంవత్సరం రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. కోడి రామకృష్ణ అసోసియేట్స్ ఎందరో ప్రస్తుతం చిత్రసీమలో రాణిస్తున్నారు. తనకు లభించిన రఘుపతి వెంకయ్య అవార్డు అందుకోకుండానే కోడి రామకృష్ణ దూరమయ్యారు. అయినా, ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలు ఈ నాటికీ బుల్లితెరపై జనాన్ని మురిపిస్తూనే ఉన్నాయి.