NTV Telugu Site icon

30 ఏళ్ళ ‘క్షణ క్షణం’

Kshana-Kshanam

(అక్టోబర్ 9తో ‘క్షణ క్షణం’కు 30 ఏళ్ళు)
తొలి చిత్రం ‘శివ’తోనే దర్శకునిగా తానేమిటో నిరూపించుకున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆ పై రెండో సినిమాగా హిందీలో ‘శివ’ను రీమేక్ చేశారు. ఆ సినిమాకు అంతకు ముందు హిందీలో వచ్చిన సన్నీ డియోల్ ‘అర్జున్’కు పోలికలు ఉన్నా, రామ్ గోపాల్ వర్మ టేకింగ్ ను బాలీవుడ్ జనం సైతం మెచ్చారు. అలా ఆల్ ఇండియాలో పేరు సంపాదించిన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రెండవ తెలుగు చిత్రం ‘క్షణ క్షణం’. దుర్గా ఆర్ట్స్ పతాకంపై సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి సమర్పణలో డాక్టర్ కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకటేశ్, శ్రీదేవి జంటగా నటించిన ‘క్షణ క్షణం’ ప్రేక్షకులను అలరించింది. 1991 అక్టోబర్ 9న ఈ చిత్రం జనం ముందు నిలచింది.

‘క్షణ క్షణం’ ఏ స్థాయిలో విజయం సాధించింది అన్న అంశం పక్కన పెడితే, ఓ చిన్న అంశాన్ని ఎంతగా రక్తి కట్టించవచ్చునో ఈ సినిమా చూసి భావి దర్శకులు తెలుసుకోవచ్చు. కథ విషయానికి వస్తే – నాయర్ నేతృత్వంలో దొంగల ముఠా బ్యాంక్ దోపిడీ చేసి కోటి రూపాయలు కొట్టేస్తుంది. ఆ మొత్తాన్ని ఓ బ్యాగ్ లో ఉంచుతారు. నాయర్ గ్యాంగ్ లోని నారాయణ ఆ మొత్తాన్ని ఓ చోట దాచి పెడతాడు. అతని తమ్ముడు నడిపే ఫోటో స్టూడియోలో ఓ కవర్ లో చిన్న క్లూ పెట్టి చస్తాడు. అనుకోకుండా ఆ ఫోటో స్టూడియోలో ఫోటోలు తీయించుకున్న సత్య అనే అమ్మాయికి ఆ కవర్ చేరుతుంది. ఆ అమ్మాయి వెంటపడతారు దుండగులు. ఆ అమ్మాయి అపార్ట్ మెంట్ లోకి వెళతారు. ఒకడు చస్తాడు. దాంతో ఆమె భయపడిపోతుంది. చందు అనే రౌడీ తారసపడతాడు. ఆమెకు సాయం చేస్తాడు. పోలీసులు వెంట పడతారు. అది తనకోసమేనని చందు భావిస్తాడు. తనకోసమే అని సత్య కూడా అనుకుంటుంది. వారిని ఫాలో అయ్యే దొంగలు పోలీసుల నుండి తప్పించుకొనే ప్రయత్నం చేస్తూంటారు. ఈ నేపథ్యంలో పోలీసులకు చిక్కకుండా అడవిలోకి వెళతారు సత్య, చందు. వారిని పట్టుకుంటాడు నాయర్. తెలివిగా వారి నుండి సత్యను తప్పించి, వారి వెహికల్ లోనే సిటీకి వస్తాడు చందు. కథ అంతా ఆ కవర్ చుట్టూ తిరుగుతోందని తెలిసిన చందు, సత్య ఇంటికి వెళ్ళి దానిని సంపాదిస్తాడు. మళ్ళీ చందు,సత్యను వెంటాడుతారు. దొరికినట్టే దొరికి తప్పించుకుంటూ ఉంటారు. డబ్బుతో ఓ రైలు ఎక్కుతారు. ఓ వైపు దొంగలు, మరోవైపు పోలీసులు మధ్యలో చందు, సత్య. ఇలా రేస్ సాగుతుంది. చివరకు నాయర్ గ్యాంగ్ ను పోలీసులు పట్టుకుంటారు. చందు పోలీసులకు డబ్బు సంచీ ఇస్తాడు. ‘అనవసరంగా మీరు కంగారు పడ్డారు, నాయర్ ఆ దొంగతనం చేసినట్టు మాకు తెలుసు’ అని పోలీస్ ఇన్ స్పెక్టర్ చెబుతాడు. సత్యను వదిలి వెళ్ళిపోతున్న చందును తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. చందు అందుకు అంగీకరించడంతో కథ ముగుస్తుంది.

‘క్షణ క్షణం’ చిత్రంలో వెంకటేశ్, శ్రీదేవి, పరేశ్ రావెల్, రామిరెడ్డి, బ్రహ్మానందం, నర్సింగ్ యాదవ్, హేమ, హార్స్ మన్ బాబు, జాక్ గౌడ్ నటించారు. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ కథ అందించగా, సత్యానంద్ మాటలు రాశారు. కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సిరివెన్నెల, వెన్నెలకంటి పాటలు రాశారు. “జాము రాతిరి జాబలిమ్మ…”, “చలిచంపుతున్న చెమక్కులో…”, “కో అంటే కోటి…”, “అమ్మాయి ముద్దు ఇవ్వందే…”, “అందనంత ఎత్తా తారాతీరం…” పాటలు భలేగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “జాము రాతిరి జాబిలమ్మ…” పాట చిత్రీకరణ జనాన్ని ఎంతగానో అలరించింది. ఇక శ్రీదేవి నటన, నృత్యం చిత్రానికి పెద్ద ఎస్సెట్ అనుకోవాలి.

‘క్షణ క్షణం’ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంది. అయితే బి,సి క్లాస్ సెంటర్స్ లో ఈ సినిమా అంతగా అలరించలేక పోయింది. హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాలలో జనాన్ని భలేగా రంజింప చేసింది. ఈ సినిమాతోనే శ్రీదేవికి ఉత్తమనటిగా తొలి నంది అవార్డు లభించింది. తొలి చిత్రం ‘శివ’తోనే బెస్ట్ డైరెక్టర్ గా నందిని సొంతం చేసుకున్న రామ్ గోపాల్ వర్మ ఈ రెండో సినిమాతోనూ మరో నందిని ఉత్తమ దర్శకునిగా అందుకోవడం విశేషం. అలాగే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గానూ రాముకు అవార్డు సంపాదించి పెట్టిందీ చిత్రం. వీరితో పాటు ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా ఎస్.గోపాల్ రెడ్డికి, ఉత్తమ ఎడిటర్ గా శంకర్ కు ఈ చిత్రం నంది అవార్డులు వచ్చేలా చేసింది. ఫిలిమ్ ఫేర్ అవార్డుల్లో తెలుగులో శ్రీదేవికి ఉత్తమనటిగా గౌరవం దక్కించింది ఈ సినిమా. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన కీరవాణికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిమ్ ఫేర్ అవార్డు లభించింది.

రామ్ గోపాల్ వర్మ రెండవ తెలుగు చిత్రంగా రూపొందిన ఈ ‘క్షణ క్షణం’తోనే ఆయన తన అభిమాన కథానాయిక శ్రీదేవితో మొదటిసారి పనిచేయడం విశేషం. ‘దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై రూపొందిన తొలి చిత్రంగానూ ‘క్షణ క్షణం’ నిలచింది. ఈ సినిమా తమిళంలో ‘ఎన్నమో నాడకుదు’ పేరుతో అనువాదమైంది. ఇప్పటికీ బుల్లితెరపై ‘క్షణ క్షణం’ ప్రత్యక్షమైతే జనం ఆసక్తిగా చూస్తూనే ఉంటారు.