NTV Telugu Site icon

వైవిధ్యం… సూర్య ఆయుధం!

ప్రతిభావంతులను ఆదరించడంలో తెలుగువారు ముందుంటారు. తమిళ స్టార్ హీరో సూర్యను మనవాళ్ళు భలేగా ఆదరిస్తున్నారు. సూర్య నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమవుతూ, ఇక్కడా విజయం సాధిస్తూనే ఉన్నాయి. ప్రముఖ తమిళనటుడు శివకుమార్ పెద్ద కొడుకు సూర్య. తండ్రి బాటలోనే పయనిస్తూ సూర్య నటనలో అడుగు పెట్టారు.

ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన ‘నెర్రుక్కు నెర్’ సినిమాతో పరిచయమైన సూర్య, ‘నందా’తో నటునిగా గుర్తింపు సంపాదించారు. ‘కాక్క కాక్క’తో మంచి విజయం చూశారు. ఈ సినిమా తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘ఘర్షణ’ పేరుతో రీమేక్ అయింది. మరో విలక్షణ నటుడు విక్రమ్ తో కలసి సూర్య నటించిన ‘పితామగన్‌’ మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘శివపుత్రుడు’గా అనువాదమై మంచి విజయం సాధించింది. అప్పటి నుంచీ తెలుగులోనూ సూర్యకు మంచి ఆదరణ లభించసాగింది. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన ‘గజిని’తో సూర్యకు స్టార్ స్టేటస్ లభించింది. ఈ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో అనువాదమై సూర్యను తెలుగువారికి మరింత దగ్గర చేసింది.

సూర్య డబ్బింగ్ సినిమాలు “యువ, ఆరు, సింగమ్ సీరీస్, సెవెంత్ సెన్స్, 24, ఎన్.జి.కె, గ్యాంగ్” వంటి చిత్రాలు ఆకట్టుకున్నాయి. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్తచరిత్ర’ తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంలో సూర్య ఏటూరి సూర్యనారాయణ రెడ్డి పాత్రలో అలరించారు. సూర్య తమ్ముడు కార్తీ సైతం తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. సూర్య భార్య జ్యోతిక కొన్ని తెలుగు చిత్రాలలో నటించి అలరించింది.

తెలుగు దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో అనువాదమయింది. సూర్య నిర్మాతగానూ అనేక చిత్రాలు నిర్మించారు. ఈ సినిమాలు కూడా తెలుగులో డబ్బింగ్ మూవీస్ గా అలరించాయి. సూర్య నటిస్తోన్న 40వ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించిన సూర్య, రాబోయే సినిమాలోనూ వైవిధ్యంగా కనిపిస్తారని చెబుతున్నారు. మరి సూర్య 40వ సినిమా ఏ తీరున అలరిస్తుందో చూడాలి.