కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి. స్వామి వారికి నైవేద్యంగాగా సమర్పించే లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు పరమపవిత్రం. ఆ శ్రీవారి దర్శనం కోసం వందల కిలో మీటర్లు ప్రయాణం చేసి గంటల కొద్దీ క్యూ లైన్స్ లో నిలబడి ఆ తిరుమలేశుడిని దర్శించుకుని అనంతరం స్వామి వారి లడ్డు ప్రసాదం స్వీకరించి గోవిందా అని లడ్డూను ఆరగిస్తూ పొంగిపోతుంటారు భక్తులు. తిరుమలకు వెళ్లొచ్చిన వారు స్వామివారి లడ్డూను ప్రసాదంగా ఇస్తే కళ్ళకు అద్దుకుని స్వామి వారికి నమస్కరించుకుని ఆయన దివ్య ఆశీస్సులు మనకు అందాలని భక్తులు భావిస్తారు. అంతటి పరమ పవిత్రమైనది శ్రీవారి లడ్డు.
చక్కెర, శనగపిండి, యాలకులు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ కలగలిపి నెయ్యి బాగా దట్టించి చేసే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం భువిపై దొరికే అమృతం అని చెప్పాలి. తిరుమలలో రకరకాలైన ప్రసాదాలైనటువంటి గారేలు, పులిహార, చెక్కర పొంగలి, వడలు వంటివి టీటీడీ అందుబాటులో ఉంచినప్పటికీ భక్తులకు లడ్డూ అంటేనే అత్యంత ప్రీతి. ఇంతటి మహా పవిత్రమైన శ్రీవారి లడ్డూ నేడు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకుంటోంది. తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా లడ్డూ ఇవ్వడంమొట్ట మొదటసారిగా ఆగస్ట్ 2 వ తేదీ 1715 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నిర్వరామంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు లడ్డూను మహా ప్రసాదంగా అందజేస్తోంది టీటీడీ. ఈరోజు అనగా ఆగస్టు 2వ తేదీ పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదం 310 సంవత్సరాల మహిమాన్విత సంవత్సరాలు. అప్పట్లో రోజుకు కేవలం పదుల సంఖ్యలో మాత్రమే తయారు చేసే లడ్డూ నేడు మూడు లక్షలకు పైగా తయారుచేసి భక్తులకు అందజేస్తోంది టీటీడీ. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీని బట్టి తయారీ పెంచుతూ వెళ్తోంది. నిత్యం వందలాది మంది సేవకులు స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉంటారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం ప్రతి పదార్దాన్ని పవిత్రంగా భావించి మనసులో స్వామి వారిని స్మరిస్తూ గోవిందా గోవిందా అని నామం జపిస్తూ లడ్డూలను తయారు చేస్తారు. అలాగే తిరుపతి లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కలిగి ఉండటం విశేషం. అంతేకాదు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014వ సంవత్సరంలో ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్’ కూడా ఇచ్చింది. అంతటి మహాప్రసాదమైన తిరుమల శ్రీవారికి ప్రితి పాత్రమైన లడ్డూకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవిందా గోవిందా గోవిందా అని ఏడుకొండల వారి అశీసులు మన అందరిపైనా ఉండాలని కోరుతూ వకుళమాత పుత్రునికి నమోస్తుతే !