Site icon NTV Telugu

నటనా’లయ’!

Happy Birthday to Actress Laya

(అక్టోబర్ 21న నటి లయ పుట్టినరోజు)
చూడగానే బాగా పరిచయమున్న అమ్మాయిలా అనిపిస్తారు లయ. మన పక్కింటి అమ్మాయే అనీ అనిపిస్తుంది. అనేక చిత్రాలలో సంప్రదాయబద్ధంగా నటించి మెప్పించారు లయ. బాల్యంలోనే ‘భద్రం కొడుకో’ చిత్రంలో భలేగా నటించి ఆకట్టుకున్నారు. జయసుధ, విజయశాంతి తరువాత వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమనటిగా నంది అవార్డులు అందుకున్న నాయికగా నిలిచారు లయ. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో ఉంటున్న లయ, తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు.

లయ పదహారు అణాల తెలుగమ్మాయి. 1982 అక్టోబర్ 21న లయ విజయవాడలో జన్మించారు. ఆమె తల్లి సంగీతం టీచర్. తండ్రి డాక్టర్. విజయవాడలో తన తల్లి పనిచేస్తున్న నిర్మల హైస్కూల్ లో లయ చదువు సాగింది. చెస్ లో మంచి ప్రావీణ్యం సంపాదించింది లయ. చదువుకొనే రోజుల్లోనే ఏడు సార్లు స్టేట్ చెస్ ఛాంపియన్ గానూ, ఓ సారి నేషనల్ లెవెల్ లో సెకండ్ ప్లేస్ లోనూ నిలిచారు లయ. డాన్స్ లోనూ ప్రావీణ్యం గడించిన లయ దాదాపు 50 నృత్యప్రదర్శనలు ఇచ్చారు. 1999లో తెరకెక్కిన ‘స్వయంవరం’ చిత్రంతో లయ నాయికగా పరిచయం అయ్యారు. వేణు హీరోగా రూపొందిన ఈ చిత్రం ఆయనకు, లయకు మంచి పేరు సంపాదించి పెట్టింది. “మా బాలాజీ, మనోహరం, దేవుల్ళు, రామ్మా చిలకమ్మా, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, శివరామరాజు, నీ ప్రేమకై, మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, విజయేంద్రవర్మ” వంటి చిత్రాలలో లయ నటించి ఆకట్టుకున్నారు. కొన్ని కన్నడ, మళయాళ, తమిళ చిత్రాలలోనూ లయ అభినయించారు. 2000లో ‘మనోహరం’ చిత్రం ద్వారా, 2001లో ‘ప్రేమించు’తోనూ ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు లయ.

లయ ఓ వైపు నటిస్తూనే, మరోవైపు తన చదువు సాగించారు. కంప్యూటర్స్ అప్లికేషన్స్ లో బ్యాచ్ లర్ డిగ్రీ చేశారు. 2006లో శ్రీగణేశ్ గొర్తిని పెళ్ళాడారు లయ. వారికి ఓ బాబు, ఓ పాప ఉన్నారు. అమెరికాలో తన చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తూసాగారు లయ. అప్పుడప్పుడూ అవకాశాలు వస్తే మాత్రం వదలకుండా మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి నటించారు. 2018లో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో లయ నటించారు. మళ్ళీ ఏ తెలుగు సినిమాలో లయ నటిస్తారో చూడాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version