NTV Telugu Site icon

భారీ చిత్రాల బి.గోపాల్ (జూలై 24న బర్త్ డే)

అసలు పేరు బెజవాడ గోపాల్, అయినా ఆయనను ‘భారీ చిత్రాల గోపాల్’ అనే పిలుస్తుంటారు. దర్శకుడు బి.గోపాల్ సినిమాలు భారీతనంతో రూపొంది ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఫ్యాక్షనిజమ్ కు హీరోయిజమ్ అద్దిన ఘనత బి.గోపాల్ సొంతం. ‘సమరసింహారెడ్డి’తో ఫ్యాక్షనిస్ట్ ను హీరోగా నిలపడంతో, ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. స్వర్ణోత్సవాలు చూసింది. దాంతో ఎందరో తెలుగు నిర్మాతలు తమ చిత్రాలలో ఫ్యాక్షనిజమ్ కు హీరోయిజమ్ ఆపాదిస్తూ చిత్రాలను తెరకెక్కించారు. గోపాల్ దర్శకత్వంలోనే తరువాత “నరసింహనాయుడు,ఇంద్ర, నరసింహుడు” వంటి చిత్రాలు ఫ్యాక్షన్ రంగు పులుముకొని అలరించాయి. ఇక ఆయన చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ అంటే తప్పకుండా ఐదారు వెహికల్స్ పేలిపోవాల్సిందే, లేదా సుమోలు తెర నిండుగా కనిపించి తీరవలసిందే. అదే బి.గోపాల్ మార్కుగా నిలచి పోయింది.

ప్రకాశం జిల్లాలోని ఎమ్.నిడమనూరులో జన్మించారు బి.గోపాల్. చదువు పూర్తి కాగానే తండ్రి అనుమతి తీసుకొని, తన అదృష్టాన్ని చిత్రీసమలో పరీక్షించుకొనేందుకు మదరాసు చేరారు. పి.చంద్రశేఖర్ రెడ్డి వద్ద కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ గా ఉన్న గోపాల్, తరువాత కె.రాఘవేంద్రరావు వద్ద చేరి, తొలుత యన్టీఆర్ ‘అడవిరాముడు’కు దర్శకత్వ శాఖలో పనిచేశారు. రాఘవేంద్రరావు వద్ద దాదాపు ఎనిమిదేళ్ళు అసోసియేట్ గా ఉన్నారు గోపాల్. రాఘవేంద్రరావు దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన ‘దేవత’ చిత్రానికి గోపాల్ అసోసియేట్ గా పనిచేశారు. అదే సమయంలో గోపాల్ పనితనం రామానాయుడును ఆకట్టుకుంది. దాంతో నాయుడు, గోపాల్ కు ‘ప్రతిధ్వని’ చిత్రం రూపొందించే అవకాశం కల్పించారు. తొలి సినిమా ‘ప్రతిధ్వని’తోనే మంచి విజయాన్ని అందుకున్నారు గోపాల్. ఇదే చిత్రాన్ని హిందీలో ‘ఇన్సాఫ్ కీ ఆవాజ్’ పేరుతో గోపాల్ దర్శకత్వంలోనే రీమేక్ చేశారు. అదీ సక్సెస్ అయింది. ఆ తరువాత ఏయన్నార్, నాగార్జున నటించిన ‘కలెక్టర్ గారి అబ్బాయి’ మంచి విజయం సాధించడంతో చిత్రసీమలో గోపాల్ పేరు మారుమోగి పోయింది.

టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ చిత్రాలను రూపొందించి, జనాన్ని మెప్పించారు. ఆయన ఎవరితో ఎన్ని సినిమాలు తీసినా, బాలకృష్ణతో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ అందించి రికార్డు సృష్టించారు. “లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు” చిత్రాలు అనూహ్య విజయం సాధించాయి. చివరలో తీసిన ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. చిరంజీవితో “స్టేట్ రౌడీ, మెకానిక్ అల్లుడు, ఇంద్ర” రూపొందించగా, ‘ఇంద్ర’ బ్లాక్ బస్టర్ గా నిలచింది. వెంకటేశ్ తో “బొబ్బిలి రాజా, రక్తతిలకం, చినరాయుడు” చిత్రాలు రూపొందించారు. ‘బొబ్బిలిరాజా’ ఘనవిజయం సాధించింది. మోహన్ బాబుతో “అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, అడవిలో అన్న, కలెక్టర్ గారు” వంటి జనరంజక చిత్రాలు తెరకెక్కించారు. నాగార్జునతో ‘విజయ్’ అనే సినిమానూ తీశారు. కృష్ణతో ‘అశ్వథ్థామ’, రాజశేఖర్ తో ‘గ్యాంగ్ మాస్టర్, రవన్న’, సుమన్ తో ‘ఖైదీ ఇన్ స్పెక్టర్’, మహేశ్ తో ‘వంశీ’, జూ.యన్టీఆర్ తో ‘అల్లరి రాముడు, నరసింహుడు’, ప్రభాస్ తో ‘అడవిరాముడు’, రామ్ తో ‘మస్కా’ చిత్రాలను రూపొందించారు గోపాల్. వీటిలో చాలావరకు జనాదరణ పొందిన చిత్రాలే అని చెప్పవచ్చు. ‘మస్కా’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నారు గోపాల్. గోపీచంద్ హీరోగా ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా తీశారు. ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదలకు నోచుకోలేక పోయింది. అంతకుముందు బాలకృష్ణతో ఓ చిత్రం ఓపెనింగ్ జరుపుకుందే కానీ, షూటింగ్ లో ముందడుగు వేయలేకపోయింది. ఏది ఏమైనా బి.గోపాల్ అనగానే ఇప్పటికీ ఆయన భారీ చిత్రాలే జనానికి గుర్తుకు వస్తాయి. దాదాపు పుష్కర కాలం నుంచీ గోపాల్ సినిమా రాలేదు. రాబోయే రోజుల్లోనైనా గోపాల్ మళ్ళీ మునుపటి సత్తా చాటుతూ చిత్రాలను అందిస్తారేమో చూద్దాం.