NTV Telugu Site icon

నవ్వుల రేడు… రాజబాబు!

(అక్టోబర్ 20న రాజబాబు జయంతి)
“నవ్వు నాలుగందాల చేటు” అన్నది పాత సామెత, “నవ్వు నలభై విధాల గ్రేటు” అనేది నా మాట – అంటూ రాజబాబు తన నవ్వుల పువ్వులతో తెలుగువారికి హాస్యసుగంధాలు అందించారు. రాజబాబు తెరపై కనిపించగానే ప్రేక్షకుల పెదాలు నవ్వడానికి విచ్చుకొనేవి. ఇక ఆయన మెలికలు తిరిగే హాస్యాభినయం జనానికి కితకితలు పెట్టేది. ఒకానొక దశలో తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములాగా రాజబాబు కామెడీ నిలచింది. నాటి టాప్ స్టార్స్ కు సమానంగా పారితోషికం పుచ్చుకున్న స్టార్ కమెడియన్ గానూ రాజబాబు రాణించారు. తెలుగువారి మదిలో ‘నవ్వుల రేడు’గా నిలచిపోయారు రాజబాబు.

రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 1937 అక్టోబర్ 20న రాజబాబు జన్మించారు. పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు, రమణమ్మ ఆయన కన్నవారు. ఆయనకు నలుగురు తమ్ముళ్ళు, ఐదుగురు అక్కాచెల్లెళ్ళు. రాజమండ్రిలో జన్మించిన రాజబాబు బాల్యం నుంచీ తన చేష్టలతో జనానికి వినోదం పంచేవారు. అప్పలరాజును అందరూ ముద్దుగా రాజాబాబు అంటూ పిలిచేవారు. తరువాతి రోజుల్లో నాటకాల్లో ఆ పేరుతోనే నటించారు రాజబాబు. ఇంటర్మీడియట్ కాగానే టీచర్ కోర్సు పూర్తిచేసి, కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో రాణించారు. అప్పుడు కూడా నాటకాలు వేస్తూ ఆకట్టుకొనేవారు. రంగస్థలంపై ఆయన “నాలుగిళ్ళ చావిడి, కుక్కపిల్ల దొరికింది” వంటి నాటకాలతో పేరు సంపాదించారు. జమున, అల్లు రామలింగయ్యను తన ‘పుట్టిల్లు’ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయం చేసిన గరికపాటి రాజారావు ఓ సారి రాజబాబు నటించిన నాటకం చూడటం జరిగింది. రాజబాబులోని టైమింగ్ రాజారావును ఆకట్టుకుంది. దాంతో ఆయన రాజబాబును మద్రాసు రమ్మని చెప్పారు. అలా రాజబాబు మద్రాసులో అడుగుపెట్టారు. ఆరంభంలో ట్యూషన్స్ చెప్పుకుంటూ గడిపారు రాజబాబు. ఏ సినిమాలోనైనా బిట్ రోల్ ఇచ్చినా, నటించడానికి వెనుకాడేవారు కాదు. 1960లో అడ్డాల నారాయణరావు అనే దర్శకుడు తాను తెరకెక్కించిన ‘సమాజం’ చిత్రంలో రాజబాబుకు అవకాశం కల్పించారు. తరువాత యన్టీఆర్ ‘ఆత్మబంధువు’లో సూర్యకాంతం కొడుకుగా నటించి, ఆకట్టుకున్నారు రాజబాబు. ఆ తరువాత కూడా ‘బందిపోటు, మంచి మనిషి’ వంటి చిత్రాల్లో బిట్ రోల్స్ లో కనిపించారు. అప్పట్లో పద్మనాభం, చలం వంటివారు కమెడియన్స్ గా రాజ్యమేలుతున్నారు. వారి మధ్య రాజబాబు రాణించడం కష్టం అని చాలామంది అనుకున్నారు. అయితే రాజబాబు వారికి భిన్నంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరచుకొని నవ్వించడం మొదలెట్టారు. సి.పుల్లయ్య రూపొందించిన ‘పరమానందయ్య శిష్యుల కథ’లో పద్మనాభం, అల్లు రామలింగయ్య వంటి మేటి నటుటతో కలసి రాజబాబు తనదైన పంథాలో పకపకలు పంచారు. ఆ సినిమాతోనే రాజబాబుకు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత యన్టీఆర్ తన సొంత చిత్రం ‘ఉమ్మడి కుటుంబం’లో వాణిశ్రీకి జోడీగా నటింప చేశారు. ఆ సినిమాలోని ‘సతీసావిత్రి’ నాటకంలో యన్టీఆర్ యమునిగా, వాణిశ్రీ సావిత్రిగా నటిస్తే, సత్యవంతునిగా రాజబాబు కనిపించారు. అందులో “సదివినోడికన్నా ఓరన్నా… మడేలన్న మిన్నా…” పాటలో రాజబాబు, వాణిశ్రీ జోడీ అలరించింది. అప్పటి నుంచీ రాజబాబుపై స్పెషల్ సాంగ్స్ కు జోరు పెరిగింది.

ఆ నాటి మేటి హీరోలందరి చిత్రాలలోనూ రాజబాబు హాస్యం తప్పనిసరిగా ఉండేది. శోభన్ బాబు, రాజబాబు మధ్య అనుబంధం బాగుండేది. ఒకరినొకరు ‘బావా’ అంటూ పిలుచుకొనేవారు. కృష్ణ హీరోగా రూపొందిన ‘ఇల్లు -ఇల్లాలు’లో పాటలన్నీ మురిపించినా, రాజబాబు, రమాప్రభపై చిత్రీకరించిన “వినరా సూరమ్మ కూతురు మొగుడా…” పాట అప్పట్లో విశేషాదరణ చూరగొంది. తెరపై రాజబాబు, రమాప్రభ జోడీ అనేక చిత్రాలలో ఎంతగానో నవ్వులు పూయించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘తాత-మనవడు’లో తాతగా ఎస్వీ రంగారావు, మనవడుగా రాజబాబు నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత దాసరి దర్శకత్వంలోనే రాజబాబు హీరోగా “తిరపతి, ఎవరికి వారే యమునా తీరే” వంటి చిత్రాలు రూపొందాయి. ‘పిచ్చోడి పెళ్ళి, మనిషి రోడ్డున పడ్డాడు’ వంటి చిత్రాల్లోనూ రాజబాబు హీరోగా నటించారు. ‘బాబ్ అండ్ బాబ్ క్రియేషన్స్’ పతాకంపై రాజబాబు చిత్రాలు నిర్మించారు. ఈ పతాకంపై రూపొందిన చిత్రాలలో ‘ఎవరికి వారే యమునా తీరే’ మంచి విజయం సాధించగా, ‘మనిషి రోడ్డున పడ్డాడు’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ‘రాధమ్మ పెళ్ళి’ చిత్రంలో రాజబాబు, రమాప్రభ స్వయంగా “కాకినాడ రేవు కాడా ఓడెక్కి…” సాంగ్ పాడటం విశేషం. అంతే కాకుండా, కొన్ని పాటల్లో రాజబాబు స్వయంగా గళం వినిపించినవీ ఉన్నాయి.

అప్పట్లో హాస్యనటులకు నంది అవార్డులు లేవు. అయితే రాజబాబు హాస్యాభినయాన్ని గౌరవిస్తూ అనేక సాంస్కృతిక సంస్థలు అవార్డులు ప్రదానం చేశాయి. మద్రాస్ ఆంధ్రా క్లబ్ రోలింగ్ షీల్డ్ ను వరుసగా ఐదు సంవత్సరాలు అందుకున్న ఘనత రాజబాబుదే. ఆయన, మహాకవి శ్రీశ్రీ తోడల్లుళ్ళు. శ్రీశ్రీ భార్య సరోజకు రాజబాబు అర్ధాంగి లక్ష్మీ అమ్ములు సోదరి. అలాగే గాయని రమోల కూడా రాజబాబు భార్యకు తోబుట్టువు. రాజబాబుకు ఇద్దరు కుమారులు నాగేంద్రబాబు, మహేశ్ బాబు. అమెరికాలో స్థిరపడ్డారు. రాజబాబు తమ్ముళ్ళలో చిట్టిబాబు, అనంత్ ఇద్దరూ హాస్యనటులుగా రాణించారు. బాల్యంలో ఆకలిబాధ తెలిసిన రాజబాబు, చిత్రసీమ తొలి రోజుల్లోనూ ఆకలి మంటలకు గురయ్యారు. అందుకే పేదవారిపై ఆయన కరుణ చూపేవారు. ఆ రోజుల్లోనే స్టార్ కమెడియన్ గా సాగిన రాజబాబు సొంతవూరు రాజమండ్రిలో పారిశుద్ధ్య కార్మికులకు దానవాయి పేటలో భూమి ఇచ్చారు. అలాగే పలు విద్యాసంస్థలకు విరాళాలు ఇచ్చారు. కోరుకొండలో తన పేరిట ఓ జూనియర్ కళాశాల కూడా నిర్మించారు. తన చుట్టూ ఉన్నవారిని సదా నవ్విస్తూ కవ్విస్తూ సాగిన రాజబాబు, 1983 ఫిబ్రవరి 14న హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన స్థానం ఈ నాటికీ భర్తీ కాలేదు. రాజబాబు హాస్యం మాత్రం తెలుగువారి మదిలో నిలిచే ఉంది. జనానికి ఆయన కామెడీ గుర్తుకు వచ్చినపుడల్లా నవ్వులు వారి సొంతమవుతూనే ఉన్నాయి.