(జూలై 28న ధనుష్ పుట్టినరోజు)
తెలివి అంతగా ఉపయోగించనివాడు – అవకాశాలన్నీ తన ప్రతిభను వెదుక్కుంటూ రావాలని ఆశిస్తాడు. తెలివైన వాడు అందిన ప్రతి అవకాశంలోనూ తన ప్రతిభను కనబరచాలని చూస్తాడు. రెండో కోవకు చెందిన నటుడు ధనుష్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడుగా గుర్తింపు పొందినా, తనలోని ప్రతిభనే నమ్ముకొని సక్సెస్ రూటులో సాగుతున్నారు ధనుష్. తన ప్రతీ చిత్రంలో ఏదో ఓ వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు ధనుష్. అదే ఆయనను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇప్పటికే రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటునిగా నిలచిన ధనుష్, రాబోయే చిత్రాల్లోనూ విలక్షణమైన పాత్రలతో సాగే ప్రయత్నంలో ఉన్నారు.
తమిళ దర్శకనిర్మాత, సంగీత దర్శకుడు అయిన కస్తూరి రాజా చిన్నకొడుకు ధనుష్. పీలగా కనిపించే ధనుష్ లో మంచి నటుడు ఉన్నాడని గుర్తించింది కస్తూరి రాజాయే. ఇక ఆయన పెద్దకొడుకు సెల్వరాఘవన్ రచయిత, దర్శకుడు. ధనుష్ తొలి చిత్రం ‘తుల్లువదో ఇలమై’ చిత్రానికి అన్న సెల్వరాఘవన్ కథ సమకూర్చగా, తండ్రి కస్తూరి రాజా దర్శకత్వం వహించారు. తరువాత వచ్చిన “పొల్లాదవన్, యారాడీ నీ మోహిని” చిత్రాలు ధనుష్ కు మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఆ తరువాత నుంచీ గాయకునిగా, గీతరచయితగా, నిర్మాతగా కూడా ధనుష్ తన ప్రతిభను చాటుకుంటూ సాగారు. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను వివాహమాడారు ధనుష్. ఆమె దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘3’ చిత్రంలోని “వై దిస్ కొలవరి డీ…” సాంగ్ ఆ రోజుల్లో అంతటా ఓ ఊపు ఊపేసింది. ఈ పాటను ధనుష్ రచించి, నటించి, పాడటం విశేషం. ఈ పాట యూ ట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి ఇండియన్ సాంగ్ గా నిలచింది. సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయినా, ‘3’ ధనుష్ కు నటగాయకునిగా గుర్తింపు తెచ్చింది. అంతకు ముందు, ఆ తరువాత కూడా ధనుష్ గళంలో జాలువారిన పలు పాటలు పరవశింప చేశాయి.
ధనుష్ నటించిన హిందీ చిత్రం ‘రాంఝనా’ కూడా ఆయనలోని నటుణ్ణి ఉత్తరాది వారికి పరిచయం చేసింది. తరువాత అమితాబ్ బచ్చన్ వంటి సీనియర్ స్టార్ తో నటిస్తూ ధనుష్ ‘షమితాబ్’లో తనదైన బాణీ పలికించారు. ఇక ధనుష్ నటించిన పలు చిత్రాలు తెలుగులోకి అనువాదమై అలరించాయి. ‘రఘువరన్ బి.టెక్.’తో ధనుష్ తెలుగువారికి మరింత దగ్గరయ్యారు. ‘ఆడుకాలం’ చిత్రంతో తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలచిన ధనుష్, రెండేళ్ల క్రితం వచ్చిన ‘అసురన్’తో మరో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. అయితే ధనుష్ మొదటి నేషనల్ అవార్డు సమయంలో మళయాళ నటుడు సలీమ్ కుమార్ కూడా ఉత్తమ నటునిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక రెండో సారి ధనుష్ జాతీయ ఉత్తమనటునిగా నిలచిన సమయంలో మనోజ్ బాజ్ పేయ్ కూడా నేషనల్ అవార్డు అందుకోవడం విశేషం! ఇలా ధనుష్ రెండు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న సమయంలో మరొకరు కూడా ఆ అవార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. దాంతో సోలోగా ఏ రోజునైనా నేషనల్ అవార్డు సంపాదించాలని తపిస్తున్నారు ధనుష్. ఈ యేడాది వచ్చిన ధనుష్ చిత్రం ‘జగమే తంత్రం’ అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఆయన నటించిన ‘అసురన్’ ఆధారంగానే వెంకటేశ్ తాజా చిత్రం ‘నారప్ప’ తెరకెక్కింది. ధనుష్ నటించిన హిందీ చిత్రం ‘అత్రంగీ రే’ ఆగస్టులో జనం ముందుకు రానుంది. ఈ సినిమా కాకుండా మరో రెండు చిత్రాలలో ధనుష్ నటిస్తున్నారు. రాబోయే చిత్రాలలో ధనుష్ ఏ విధమైన వైవిధ్యం ప్రదర్శిస్తారో చూడాలి.