కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు అంటే ఎవరికీ అంతగా తెలియదు, అదే ‘సుత్తివేలు’ అన్నామనుకోండి, ఇట్టే నవ్వులు మన పెదాలపై నాట్యం చేస్తాయి. జంధ్యాల సృష్టించిన సుత్తి జంటలో వీరభద్రరావుతో కలసి వేలు పలికించిన హాస్యాని తెలుగు జనం ఎన్నటికీ మరచిపోలేరు. తన దరికి చేరిన ప్రతీపాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులకు వినోదాన్ని అందించి సంతృప్తి చెందారు వేలు. దాదాపు రెండు వందల చిత్రాలలో సుత్తివేలు హాస్యం భలేగా జనాన్ని ఆకట్టుకుంది.
సుత్తివేలు తండ్రి బడిపంతులు. చిన్నతనం నుంచీ వేలుకు సాహిత్యంలో పట్టు ఉండేది. లయబద్ధంగా పద్యాలు వల్లించేవారు. దాంతో ఏడేళ్ళ వయసులోనే ఓ నాటకంలో నటించేశారు. అప్పటి నుంచీ వేలు మనసు నటనపైకి మళ్ళింది. తండ్రి ఎంతగా మందలించినా, వేలు పరుగులు తీస్తూ నాటకాలు వేసేవారు. అదే ఆయనను సినిమా రంగానికి చేరువ చేసింది. జంధ్యాల ‘ముద్దమందారం’ ద్వారా చిత్రసీమకు పరిచయమైన వేలు, ఆ తరువాత అదే జంధ్యాల ‘నాలుగు స్తంభాలాట’లో వీరభద్రరావుతో కలసి హాస్యం పండించి, ఇద్దరూ ‘సుత్తి జంట’గా తెలుగునేలను తమ హాస్యంతో నవ్వులతోటగా మార్చారు.
సుత్తివేలు వాచకమే విలక్షణంగా ఉండేది. దాంతోనే మంచి టైమింగ్ చూపిస్తూ సాగారు వేలు. జంధ్యాల చిత్రాలతోనే ప్రఖ్యాతిగాంచిన సుత్తివేలు, ఇతరుల సినిమాల్లోనూ వైవిధ్యమైన పాత్రలు పోషించారు. కేవలం నవ్వించడమే కాదు, కరుణరస పాత్రల్లో కన్నీరూ పెట్టించారు. ప్రతినాయకునిగానూ కొన్నిసార్లు విజృంభించారు. ఏది చేసినా, ప్రతీచోటా తన మార్కు ప్రదర్శించేవారు వేలు. ‘వందేమాతరం’ చిత్రంలో ఉత్తమ సహాయనటునిగా నంది అవార్డును అందుకున్న సుత్తివేలు, ఆ తరువాత “దేవాలయం, గీతాంజలి, మాస్టారి కాపురం” చిత్రాల ద్వారా మూడుసార్లు ఉత్తమ హాస్యనటునిగా నందులను తన ఇంటికి తీసుకు వెళ్ళారు.
జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన “రెండు జెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, బాబాయ్-అబ్బాయ్, ఆనందభైరవి, రెండు రెళ్ళు ఆరు, సీతారామకళ్యాణం, సాహసం సేయరా డింభకా, జయంబు నిశ్చయంబురా, చూపులు కలసిన శుభవేళ, చంటబ్బాయ్, అహ నా పెళ్ళంట” వంటి చిత్రాలలో నవ్వులు పూయించారు. ‘ప్రతిఘటన’లో పిచ్చివాడిగానూ, ‘అగ్నిపుత్రుడు’లో పేదబ్రాహ్మడిగానూ, ‘కలికాలం’లోనూ కరుణరసం కురిపించిన వేలు మరెన్నో మరపురాని పాత్రల్లో అలరించారు. ‘ఆదిత్య 369’లో పోలీస్ గా హీరో,హీరోయిన్ తో కలసి భూత, భవిష్యత్ కాలాల్లోకి వెళ్ళి అతను చేసిన సందడిని ఎవరూ మరచిపోలేరు. ఇక ‘ఇన్ స్పెక్టర్ ప్రతాప్’లో వేలు బ్రేక్ డాన్స్ ను, ‘రాము’లో పేరడీ పాటలో పండించిన పకపకలు కూడా ప్రేక్షకులు మరువలేదు. వేలు పేరు తలచుకున్నప్పుడల్లా జనానికి నవ్వులు సొంతం అవుతూనే ఉంటాయి.