Bajirao Peshwa : మరాఠా చరిత్రలో బాజీరావు ప్రథమ్ పేరు ధైర్యానికి, అద్భుతమైన యుద్ధ తంత్రానికి మారుపేరుగా నిలిచింది. అతి చిన్న వయసులోనే అధికార శిఖరాగ్రానికి చేరుకున్న ఆయన, తన స్వల్ప జీవిత కాలంలోనే సాటిలేని సైనిక విజయాలను సాధించి చరిత్రలో నిలిచిపోయారు. ఆయన జీవితం నేటికీ నాయకత్వానికి, ప్రేరణకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. ఏప్రిల్ 28న ఆయన వర్ధంతి సందర్భంగా, కేవలం 20 ఏళ్లకే పీష్వాగా ఆయన ఎదిగిన తీరు , సాధించిన విజయాల గురించి ప్రత్యేక కథనం.
బాల్యం, పీష్వాగా బాధ్యతలు
బాజీరావు ప్రథమ్ ఆగస్టు 18, 1700న జన్మించారు. ఆయన తండ్రి బాలాజీ విశ్వనాథ్ మరాఠా సామ్రాజ్యంలో పీష్వాగా ఉండేవారు. ఆ కాలంలో పీష్వా పదవి నేటి ప్రధానమంత్రి పదవితో సమానమైనది. బాజీరావు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలు , రాజకీయంపై ఎంతో ఆసక్తి కనబరిచేవారు, అతి తక్కువ కాలంలోనే గుర్రపు స్వారీ, యుద్ధ కళల్లో ప్రావీణ్యం సంపాదించారు. 1720లో ఆయన తండ్రి మరణించడంతో, అప్పటి మరాఠా చక్రవర్తి ఛత్రపతి సాహు మహారాజ్ కేవలం 20 ఏళ్ల వయసున్న బాజీరావును పీష్వాగా నియమించారు. అనుభవం లేని యువకుడికి అంతటి బాధ్యత ఇవ్వడంపై అప్పట్లో దర్బారీల్లో వ్యతిరేకత వచ్చినప్పటికీ, సాహు మహారాజ్ ఆయనపై నమ్మకం ఉంచారు. బాజీరావు తన ప్రతిభతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రత్యర్థుల నోళ్లు మూయించారు.
శివాజీ పీష్వానా? అనే అపోహపై క్లారిటీ
చాలామందిలో బాజీరావు ప్రథమ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలానికి చెందిన పీష్వా అనే అపోహ ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. శివాజీ మహారాజ్ 1680లో మరణించగా, బాజీరావు 1700లో జన్మించారు. ఆయన ఛత్రపతి సాహు మహారాజ్ దగ్గర పీష్వాగా పనిచేశారు. అయితే, శివాజీ ఆశయాలను, స్వరాజ్య కాంక్షను బాజీరావు అత్యంత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లడం వల్ల ఈ అపోహ ఏర్పడింది. శివాజీ వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరాఠా సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అజేయమైన యుద్ధ తంత్రం, విజయాలు
బాజీరావు యుద్ధ నీతి మిగతా వారికంటే భిన్నంగా ఉండేది. ఆయన భారీ సైన్యంతో కంటే వేగంతో శత్రువును దెబ్బతీసేవారు. గెరిల్లా యుద్ధ పద్ధతులను సమర్థిస్తూ, శత్రువు ఎక్కడ బలహీనంగా ఉన్నాడో అక్కడే దెబ్బతీయాలనేది ఆయన ప్రధాన సూత్రం. ఆయన తన 20 ఏళ్ల పాలనలో సుమారు 40 యుద్ధాలు చేసి, ఒక్క దానిలో కూడా ఓడిపోకపోవడం విశేషం. 1728లో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పాల్ఖేడ్ యుద్ధం ఆయన కీర్తిని పెంచింది. అలాగే ఉత్తర భారత దేశంలో మరాఠా ప్రభావాన్ని పెంచుతూ మాల్వా, బుందేల్‌ఖండ్ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. బుందేల్‌ఖండ్ మహారాజు ఛత్రసాల్‌కు అండగా నిలవడంతో, ఆయన బాజీరావును తన కుమారుడిలా భావించి రాజ్యంలో కొంత భాగాన్ని కానుకగా ఇచ్చారు. 1737లో ఏకంగా మొఘల్ రాజధాని ఢిల్లీపై దాడి చేసి మొఘల్ సత్తాను వణికించారు.
నాయకత్వ శైలి, వ్యక్తిగత జీవితం
బాజీరావు కేవలం ఆజ్ఞలు ఇచ్చే నాయకుడు కాదు, స్వయంగా యుద్ధ భూమిలోకి దూకి సైనికులతో కలిసి పోరాడే వీరుడు. శీఘ్రంగా నిర్ణయాలు తీసుకోవడం, రిస్క్ తీసుకోవడానికి వెనుకాడకపోవడం ఆయన విజయాలకు ప్రధాన కారణాలు. ఆయనకు కాశీబాయితో వివాహం జరిగింది, అయితే మస్తానీతో ఆయనకు ఉన్న సంబంధం అప్పట్లో వివాదాలకు దారితీసినప్పటికీ ఆయన తన నిర్ణయానికే కట్టుబడి ఉండేవారు. దురదృష్టవశాత్తూ 1740 ఏప్రిల్ 28న కేవలం 40 ఏళ్ల వయసులోనే ఆయన అకస్మాత్తుగా మరణించారు. శివాజీ తర్వాత మరాఠా శక్తిని దక్షిణం నుండి ఉత్తరం వరకు విస్తరించిన గొప్ప యోధుడిగా బాజీరావు ప్రథమ్ చరిత్రలో నిలిచిపోయారు. నేటికీ భారతీయ గొప్ప సేనాపతులలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
