NTV Telugu Site icon

‘దిల్ చాహ్ తా హై’కి 20 ఏళ్ళు

(ఆగస్టు 10తో ‘దిల్ చాహ్ తా హై’కి ఇరవై ఏళ్ళు పూర్తి)

ఒకప్పుడు ఫర్హాన్ అఖ్తర్ అంటే జావేద్ అఖ్తర్ తనయుడు అనే గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఫర్హాన్ తండ్రి జావేద్ అనేలా పేరు సంపాదించాడు. నటునిగా, దర్శకునిగా జనం మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘దిల్ చాహ్ తా హై’. 2001 ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనే దర్శకునిగా తనదైన బాణీ పలికించిన ఫర్హాన్ అఖ్తర్ కు ఆ తరువాత పలు అవకాశాలు పలకరించాయి. అయినా, ప్రతీ చిత్రాన్ని అంగీకరించకుండా, తన మనసుకు నచ్చినవారితోనే ఫర్హాన్ పనిచేస్తూ సాగారు. ఇక నటుడైన తరువాత ఫర్హాన్ తీరే వేరుగా మారింది. ఏది ఏమైనా ఫర్హాన్ అనగానే ‘దిల్ చాహ్ తా హై’ ముందుగా గుర్తుకు వస్తుంది. ఆ తరువాతే ఆయన నటించిన ‘భాగ్ మిల్కా భాగ్’ వంటివి స్ఫురిస్తాయి. మెట్రో పాలిటన్ ఏరియాల్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇతర చోట్ల అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఫర్హాన్ దర్శకత్వ ప్రతిభను మాత్రం జనం మెచ్చారు.

‘దిల్ చాహ్ తా హై’ కథ ముగ్గురు మిత్రుల చుట్టూ తిరుగుతుంది. ముగ్గురూ ఉన్నత కుటుంబాలకు చెందిన వారే ! అయితే, ఒక్కొక్కరి సంసారంలో ఒక్కోలా సరిగమలు పలకడం ఇందులోని ప్రధానాంశం. ఆకాశ్ మల్హోత్రా, సిద్ధార్థ్ సిన్హా, సమీర్ ముల్ చందాని ముగ్గురూ మంచి మిత్రులు. చదువు పూర్తి కాగానే ఎంతో సరదాగా తిరుగుతారు. గోవా టూర్ వెళ్ళి గమ్మత్తులు చేస్తారు. వీటన్నిటినీ మదిలో నింపుకొని సరదాగా ఉన్న వారి జీవితాల్లో పరిస్థితులు ప్రభావం చూపుతాయి. ఆకాశ్ ఓ పార్టీలో చూసిన అమ్మాయిని సరదాగా ఆటపట్టించి, అవమానానికి గురవుతాడు. అయినా, విధి వారిద్దరినీ కలుపుతూ సాగుతుంది. చివరకు ఆకాశ్ కన్నవారు, మిత్రుడు సమీర్ ప్రోత్సాహంతో కోరుకున్న అమ్మాయిని చేరుకుంటాడు. ఇక సమీర్ ప్రేమకథ కూడా పలు మలుపులు తిరిగి సంతోష సంగీతం వినిపిస్తుంది. పెయింటర్ అయిన సిద్ధార్థ్ మాత్రం తనకంటే వయసులో పెద్ద అయిన తార అనే ఆమెను ప్రేమిస్తాడు. ఆమె ఎక్కువ రోజులు జీవించదని తెలుసుకుని కుమిలి పోతాడు. ఓ చిన్న కారణంగా విడిపోయిన ఆకాశ్, సిద్ధును మళ్ళీ సమీర్ కలుపుతాడు. చివరకు ఆమె కన్నుమూస్తుంది. ఒకప్పుడు తాము అనుకున్న విధంగా ముగ్గురు మిత్రులు మళ్ళీ గోవా టూర్ వెళతారు. అక్కడ సిద్ధుకు ఓ అమ్మాయి కనిపించడం, తరువాత మూడు జంటలు కలసి భోంచేస్తూ ఉండడంతో కథ ముగుస్తుంది.

చెప్పుకుంటే ‘దిల్ చాహ్ తా హై’ కథలో పెద్ద వైవిధ్యమేమీ కనిపించదు. అయితే కథలో మనసుకు హత్తుకొనే సన్నివేశాలను చొప్పించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందులో ఆకాశ్ గా ఆమిర్ ఖాన్, సిద్ధార్థ్ గా అక్షయ్ ఖన్నా, సమీర్ గా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆకాశ్ ప్రేయసిగా ప్రీతి జింటా, సిద్ధు మనసు పడ్డ వనిత తారగా డింపుల్ కపాడియా అభినయించారు. సోనాలీ కులకర్ణి, రజత్ కపూర్, సుచిత్రా పిళ్ళై, సుహాసినీ ములయ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి జావేద్ అఖ్తర్ రాసిన పాటలు, శంకర్-ఎహసాన్-లాయ్ సమకూర్చిన సంగీతం పెద్ద ఎస్సెట్. ఇందులోని పాటలన్నీ జనాన్ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ముందు వచ్చిన ఆమిర్ ఖాన్ ‘లగాన్’లోని “మిత్వా… సున్ మిత్వా…” పాటతో పాటు, ఇందులోని “జానే క్యు లోగ్ ప్యార్ కర్తే హై…” పాటతోనూ ఉదిత్ నారాయణ్ కు ఉత్తమ గాయకునిగా నేషనల్ అవార్డు లభించింది. ఈ చిత్రానికి ఉత్తమ హిందీచిత్రంగా నేషనల్ అవార్డు దక్కడం విశేషం. “కైసీ హై ఏ రూత్…”, “వో లడ్కీ హై కహా…”, “దిల్ చాహ్ తా హై…”, “కోయి కహే కెహతా రహే…”, “తన్హాయీ….” వంటి పాటలు విశేష ఆదరణ చూరగొన్నాయి.