‘గాడ్ ఫాదర్’ ప్రపంచవ్యాప్తంగా సినీఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న టైటిల్ ఇది. ఇప్పుడు ఈ టైటిల్ తో మెగా స్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా వస్తోంది. ఆ చిత్రంలో ‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి ఫస్ట్ లుక్ ను సోమవారం సాయంత్రం 5.45 గంటలకు విడుదల చేశారు. “Black is not bad; Black is always beautiful” అనేవారు ఎందరో ఉన్నారు. సినీజనం సైతం ‘బ్లాక్ కలర్’కు జైకొడుతూ ఫంక్షన్స్ కు, పార్టీలకు బ్లాక్ కలర్ నే ధరిస్తున్నారు. ఒకప్పుడు నలుపు అంటే విషాదానికి చిహ్నం అనేవారు. నేడు, నలుపుతోనే గెలుపు అంటున్నారు. ఆ తీరున చిరంజీవి బ్లాక్ కలర్ కుర్తా,షెర్వానీ వేసుకొని కాస్త వయసుమళ్ళినట్టుగా తెల్ల జుట్టుతో నల్ల కళ్ళ జోడు పెట్టుకొని కారు దిగుతూ తనదైన స్టైల్ లో నడుస్తూ ‘ఫస్ట్ లుక్’తోనే ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. ‘ద బాస్ ఈజ్ హియర్ టు రూల్ ఫరెవర్’ అనే క్యాప్షన్ సైతం అభిమానులను కిర్రెక్కిస్తోందని చెప్పవచ్చు.
మళయాళ చిత్రం ‘లూసిఫర్’ ఆధారంగా రూపొందుతోన్న ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి రాజా మోహన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ తో కలసి కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించింది. సురేఖ కొణిదెల సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మాతలు. థమన్ సంగీతం సమకూర్చారు. విజయదశమి కానుకగా ‘గాడ్ ఫాదర్’ జనం ముందుకు రానుంది. విశేషమేమంటే, అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కూడా పాల్గొనడం విశేషం! దీంతో చిరంజీవి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అన్న మాటలూ వినిపిస్తున్నాయి. అదే రోజు సాయంత్రం విడుదలైన ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ లోనూ తెలుపు, కాషాయం కలసిన జెండాలతో చిరంజీవికి స్వాగతం పలికేలా ఈ ఫస్ట్ లుక్ రూపొందడం మరింత విశేషంగా మారింది! దీని అర్థమేంటో ‘గాడ్ ఫాదర్’ దసరాకు చెబుతాడన్నమాట!
