NTV Telugu Site icon

బాలు పాట… ప్రతీ చోట…

(సెప్టెంబర్ 25న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి)

గానగంధర్వుడుగా జనం మదిలో నిలచిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మనవాడు. తెలుగువాడు. బాలు పాటే మనకు తోడు. మనసు బాగోలేనప్పుడు ఆయన గానం మనకు ఓదార్పు. బాలు గాత్రంలో జాలువారిన హుషారయిన పాటలు వింటే చాలు జోష్ కలగాల్సిందే! అంతలా మనలను అలరించిన బాలు భారతీయుడు కావడం మహదానందం. ఇంకా చెప్పాలంటే బాలు పాట విన్నప్రతీవారూ పులకించిపోతారు. ఆ కోణంలో బాలు విశ్వమానవుడు కూడా! ఏ తీరున చూసినా బాలు అందరివాడు. అందరినీ మెప్పించినవాడు. భావితరాలకు స్ఫూర్తి ప్రదాత! తెలుగు పలుకు ఉన్నంత వరకు ఆయన పాట కూడా సాగుతూనే ఉంటుంది. మనకు ఆనందం పంచుతూనే ఉంటుంది. అదీ బాలు గళ మాహాత్మ్యం!

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనగానే ఈ తరం వారికి ‘పాడుతా..తీయగా…’ గుర్తుకు వస్తుంది. ఆ వేదిక నుండి ఎందరో గాయనీగాయకులను చిత్రసీమకు అందించిన ఘనత నిస్సందేహంగా బాలుదే! ఆ తరువాత అదే పంథాలో ఎందరో పయనించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఆ కార్యక్రమాలను చూస్తే బాలు లేని లోటు ఏ పాటిదో ఇట్టే తెలిసి పోతుంది. ‘నాది శ్రుత పాండిత్యం…’ అంటూనే పండితులకు సైతం అంతుచిక్కని అనంత కోణాలను ఆవిష్కరిస్తూ బాలు పలికిన పలుకులు ఈ నాటికీ మన మదిలో చిందులు వేస్తూనే ఉన్నాయి. బాలు నిర్వహించిన సంగీత కార్యక్రమాల్లో ఆయన నోటి నుండి జాలువారిన అమూల్యమైన మాటలు భావితరాలకు బంగారు బాటలు వేస్తూనే ఉన్నాయి. నొప్పించక తానొవ్వక… అన్న చందాన బాలు చిత్రసీమ ప్రయాణం సాగింది. ఇక న్యాయనిర్ణేతగా కూడా బాలు అదే పంథాలో సాగి, వర్ధమాన గాయనీగాయకుల గాత్రాలను సవరించిన తీరును సంగీతప్రియులు ఏ నాటికీ మరచిపోలేరు.

ఏమిటి మీ బాలు గొప్ప? అని ఎవరూ ప్రశ్నించలేరు. ఎందుకంటే బాలు ఏ భాషలో పాట పాడినా, ఆ భాషవారిని ఇట్టే ఆకట్టుకొనేవారు. కేవలం మధురగానంతో పరవశింప చేయడమేనా బాలుకు ఉన్న గొప్ప! అలా అన్నా తప్పే అవుతుంది. ప్రపంచంలో మరే గాయకుడూ పాడనన్ని పాటలు పాడి జనానికి మహదానందం పంచినవారు బాలు. ఆ రికార్డు సృష్టించిన సమయంలో ఎందరో బాలును ఆకాశానికి ఎత్తేశారు. కానీ, అంతటి ఉన్నత శిఖరం మీదున్నా, “నేనెప్పటికీ మీ బాలుణ్ణే… మీ బాలూనే…” అంటూ ఎంతో సంస్కారవంతంగా బాలు పలికిన పలుకులు ఈ నాటికీ అభిమానుల మదిలో మారుమోగుతూనే ఉన్నాయి. అదే బాలు గొప్పతనం. ఆయన పాటే కాదు సంస్కారం సైతం మధురమైనదే! అలాంటి మధురమూర్తి మన బాలు అవనిని వీడి అప్పుడే ఏడాది అయిందా అనిపిస్తుంది. అసలు బాలును, బాలు మాటను, ఆయన పాటను మరచిపోగలమా!? మతిమరపు అధికంగా ఉన్న వారికి సైతం బాలు పాట, మాట, సంస్కారం అన్నీ గుర్తుంటాయి. ఆ విషయం ఆయనకూ బాగా తెలుసు. అందుకే “ఇదే పాట…ప్రతీచోటా…ఇలాగే పాడుకుంటాను…” అంటూ ఏడాది క్రితం ఇదే రోజున (సెప్టెంబర్ 25న) దివికేగి అక్కడివారికి తన పాటతో మధురం పంచుతున్నారు.