బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27వ తేదీన తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఆయన స్నేహితులు కూడా సల్మాన్ కు పుట్టిన రోజు విషెస్ అందించడం సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సీనియర్ హీరోలు వెంకటేష్ దగ్గుబాటి, చిరంజీవి సల్మాన్‌కు స్వీట్ బర్త్ డే విషెస్ తో పాటు ఫోటోల ద్వారా సల్మాన్ భాయ్ తో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక చిరంజీవి, వెంకటేష్ నెక్స్ట్ మూవీస్ లో సల్మాన్ అతిథిగా కన్పించనున్నారు అన్న విషయం తెలిసిందే.
వెంకీ.. సల్మాన్ తో కలిసి బైక్ పై కూర్చున్న త్రోబాక్ ఫోటోను షేర్ చేస్తూ “హ్యాపీ బర్త్ డే డియర్ సల్మాన్ ఖాన్. ఈ సంవత్సరం మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను!” అని ట్వీట్ చేశారు.
సల్మాన్ మరో సౌత్ స్టార్ చిరంజీవికి సన్నిహిత కుటుంబ స్నేహితుడు. రామ్ చరణ్‌తో కూడా ఆయన సన్నిహితంగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇక సౌత్ మెగాస్టార్ చిరంజీవి కూడా సల్మాన్ ఖాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ “నా ప్రియమైన సల్లూ భాయ్ !!!! మంచి వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరులకు మంచి చేయాలని ఆలోచిస్తారు. భగవంతుడు మీలాంటి మంచి ఆత్మను ఎల్లప్పుడూ జీవితంలో సంతోషంగా, ఆరోగ్యంగా మరియు సుసంపన్నంగా ఉంచాలని కోరుకుంటున్నాను. బంగారు హృదయంతో ఎప్పటికీ యువ సూపర్‌స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు!” అని చిరంజీవి ట్వీట్ చేశారు.
