NTV Telugu Site icon

SonyLiv: నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ను దాటేసిన సోనీ!

Sony Liv

Sony Liv

కుందేలు- తాబేలు కథ తెలియనివారు ఉండరు. అడుగు తీసి అడుగు వేయడానికే కష్టమైన తాబేలు తనను గెలవలేదని, కుందేలు పరుగు పందెంలో ఆదమరచి నిదురపోయింది. ప్రయత్నం చేస్తే పోయేదేంటి అన్న సంకల్సంతో తాబేలు బయలు దేరింది. చివరకు విజేతగా నిలచింది. ఈ కథ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవలసి వస్తోందంటే, ‘ఓవర్ ద టాప్ ప్లాట్ ఫామ్స్’లో జెయింట్స్ కే చుక్కలు చూపిస్తూ ఓ చిన్న కంపెనీ విజేతగా నిలచింది. ఆ ముచ్చట చెప్పుకోవడానికే ఈ కథ మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఆ తాబేలు పేరు ‘సోనీ లైవ్’! కుందేలులాగే వేగంగా పరుగు తీయగల సత్తా, ఆర్థిక పుష్టి, అంగబలం ఉన్న సంస్థలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్. ఈ రెండు సంస్థలనూ అధిగమిస్తూ అందరినీ ఆశ్చర్య పరచింది సోనీ లైవ్.

లెక్కల చిట్టా తీస్తే ఫ్రీగా ప్రదర్శనచూపే ‘యూ ట్యూబ్, ఎమ్ ఎక్స్ ప్లేయర్’ను మినహాయిస్తే, హైబ్రిడ్ మోడ్ లోని ‘డిస్నీ హాట్ స్టార్’ 42.7 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ తో అన్నిటికంటే ముందుంది. దాని ఆదాయం ఇండియాలో రూ.1500 కోట్లు. కానీ, ‘సోనీలైవ్’ 18.2 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ తో రూ.1200 కోట్ల ఆదాయం చూస్తోంది. ఇదే ఆశ్చర్యపరుస్తోంటే, ‘సోనీ లైవ్’ కంటే ఎన్నో కోట్లు వెచ్చిస్తోన్న అమెజాన్ సంస్థ మన దేశంలో 14 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ను, నెట్ ఫ్లిక్స్ సంస్థ కేవలం 5.9 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ను పోగేశాయి.

2013లో సోనీ లైవ్ మన దేశంలో మొదలైనప్పుడు ఆ సంస్థకు 0.7 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. అంటే కేవలం ఏడు లక్షల చందాదారులే అన్నమాట! ఈ రోజున కోటి ఎనభై లక్షల మందికి పైగా చందాదారులను పోగేయగలిగింది. అసలు ఈ లెక్కలన్నీ కేవలం రెండు మూడేళ్ళలోనే తారుమారయ్యాయని పరిశీలకులు చెబుతున్నారు. ‘సోనీ లైవ్’లో 2019 జూన్ 27న ‘గుల్లక్’ వెబ్ సిరీస్ ప్రదర్శన ప్రారంభమయింది. ఇది మధ్య తరగతివారిని విశేషంగా ఆకట్టుకుంది. హర్షద్ మెహతా స్కామ్ ఆధారంగా రూపొందిన ‘స్కామ్ 1992’ సిరీస్ 2020 అక్టోబర్ 9 న మొదలయింది. ఇది యువతను విశేషంగా మురిపించింది. 2021 అక్టోబర్ 15న మొదలైన ‘తబ్బర్’ కూడా యూత్ ను భలేగా ఆకర్షించింది. వినోదంతో పాటు విజ్ఞానం అనే దిశలో రూపొందిన ‘రాకెట్ బాయ్స్’ సిరీస్ మన దేశానికే గర్వకారణంగా నిలచిన విక్రమ్ సారాభాయ్, హోమీ బాబా జీవితగాథల నేపథ్యాన్ని తనలో నింపుకుంది. 2022 ఫిబ్రవరి 4న ఈ సిరీస్ మొదలయింది. ఈ వెబ్ సిరీస్ భారతీయులను విశేషంగా అలరిస్తున్నాయి. దాంతోనే సోనీ లైవ్ కు చందాదారుల సంఖ్య కేవలం మూడేళ్ళలో గణనీయంగా పెరిగింది.

ప్రస్తుతం ప్రపంచంలోనే ఓటీటీని అత్యధికంగా ఆదరించేవారిలో భారతీయుల సంఖ్య ప్రత్యేకం! దాంతో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ సంస్థలు భారతదేశంపైనే తమ దృష్టిని కేంద్రీకరించాయి. వారి కంటే మిన్నగా సాగుతోన్న ‘సోనీ లైవ్’ ఎలా అంతటి విజయం సాధించింది అన్న అంశంపై ఆ బిగ్ బాబ్స్ ఆశ్చర్యపోతున్నాయి. ‘జనం కోరేదే మనం ఇచ్చేటట్లయితే, వారు మనల్ని మెచ్చేందుకు సిద్ధంగా ఉంటారు’ ఈ సూత్రాన్నే తాము అనుసరిస్తున్నామని సోనీలైవ్ ప్రతినిధి ఖాన్ అంటున్నారు. భారతదేశంలో ఓటీటీ ద్వారా వినోదం పొందేవారెవరో తాము గుర్తించగలిగామని, వారికి తగ్గ కథలను అందిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చునని భావించామని, అందువల్లే చందాదారులను పెంచుకోగలిగామని ఆయన వివరించారు. మరో యేడాదికి తాము 30 మిలియన్ల చందాదారులను పోగేయగలమన్న ధీమానూ వారు వ్యక్తం చేస్తున్నారు. అన్నిటినీ మించి వారి పరిశీలనలో ఉత్తర భారతం కంటే దక్షిణాది నాలుగు భాషలవారే ఓటీటీని అధికంగా వీక్షిస్తున్నారనీ తేలింది. అందువల్ల ప్రాంతీయ భాషలపైనా వారు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ఈ ప్రయత్నంలోనే ఉన్నాయి. సోనీ సక్సెస్ ను చూసి ‘జీ సంస్థ’ సైతం ఆ సంస్థతో మిళితం కాబోతోంది. దీంతో చందాదారులను ఆకట్టుకొనేందుకు మరింత భారీగా దక్షిణ భారతీయ భాషల వారిని అలరించే సిరీస్, మూవీస్ తో సోనీ సందడి చేయబోతోంది. మరి సోనీ సాగిస్తోన్న సందడిని ఏ సంస్థ బ్రేక్ చేస్తుందో చూడాలి.