బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇప్పుడు తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఫాంటసీ చిత్రం “జటాధర” ద్వారా ఆమె టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుండగా, ఇందులో సోనాక్షి లేడీ విలన్‌గా కనిపించబోతుంది. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రల తో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమని తెలుస్తోంది.
ఇటీవల చిత్ర ప్రమోషన్‌ల్లో పాల్గొన్న సోనాక్షి, “జటాధర” అనుభవం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.. సోనాక్షి మాట్లాడుతూ “నా కెరీర్‌లో ఇది ఫిజికల్‌గా అత్యంత కష్టమైన పాత్ర. ఈ పాత్ర కోసం నేను వేసుకున్న ఆభరణాల బరువు ఏకంగా 50 కిలోలు ఉండేది. ప్రతి రోజు షూటింగ్‌కి సిద్ధం కావడానికి కనీసం మూడు గంటల సమయం పట్టేది. ఆభరణాల బరువుతో కదలడమే కష్టం, కానీ యాక్షన్ సీన్స్ చేయాల్సి రావడంతో ఇంకా ఛాలెంజింగ్‌గా మారింది. నేను ధరించిన చీరకి ఆభరణాలు కుట్టి వేసేవారు. యాక్షన్ సన్నివేశాల్లో అవి కదలకుండా ఉండేందుకు అలా చేయాల్సి వచ్చేది. రోజంతా ఆ కాస్ట్యూమ్స్‌లో ఉండడం చాలా అలసట కలిగించేది. అయినా పాత్ర కోసం ఆ శ్రమ అంతా నేను ఆనందంగా భరించాను. ఎందుకంటే ఇది నాకు కొత్త అనుభవం, కొత్త లుక్” అని చెప్పింది.
సోనాక్షి మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో పనిచేయడం చాలా మంచి అనుభవమని, ఇక్కడి టీమ్ చాలా ప్యాషన్‌తో పనిచేసిందని పేర్కొంది. “సుధీర్ బాబు చాలా డెడికేటెడ్ యాక్టర్. దర్శకుడు రూపొందించిన విజన్ అద్భుతం. ‘జటాధర’ సినిమా విజువల్‌గా, భావోద్వేగంగా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని నమ్మకం ఉంది” అని చెప్పింది. ప్రస్తుతం సోనాక్షి చెప్పిన అనుభవాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో “జటాధర”తో సోనాక్షి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
