NTV Telugu Site icon

Waltair Veerayya: నెట్టింట హాట్ టాపిక్.. ఎన్టీఆర్ సినిమాకు వాల్తేరు వీరయ్య మూవీ కాపీనా?

Waltair Veerayya

Waltair Veerayya

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీలో వింటేజ్ చిరంజీవిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ మూడురోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. అయితే ఓ వార్త మాత్రం అభిమానులకు కోపం తెప్పిస్తోంది. బరిలో మెగా, నందమూరి హీరోల సినిమాలు ఉన్నప్పుడు కామెంట్లు రావడం సాధారణమే. వీరసింహారెడ్డి మూవీ తొలిరోజు మెగా అభిమానులు థియేటర్‌లో ఓ వ్యక్తి సినిమా బాగోలేదని చెప్పిన వీడియోను వైరల్ చేయగా.. తాజాగా నందమూరి అభిమానులు కూడా వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి ఓ వార్తను వైరల్ చేస్తుండటం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: Robin Uthappa: టీమిండియాది ఇదేం తీరు? ఆటగాళ్లకు ఏం సందేశం ఇస్తున్నారు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాకు వాల్తేరు వీరయ్య మూవీ కాపీ అని పలువురు నందమూరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఊసరవెల్లిలో తమన్నా అన్న కిక్ శ్యామ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని చనిపోవడం.. వాల్తేరు వీరయ్యలో చిరు తమ్ముడు రవితేజ కూడా ఇలాగే చనిపోవడం ఉదాహరణ అని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఊసరవెల్లిలో తమన్నా కోసం ఎన్టీఆర్ బరిలోకి దిగి ఆమె అన్న నిజాయితీని లోకానికి చాటేందుకు ప్రయత్నించగా.. వీరయ్య సినిమాలో చిరు కూడా తన తమ్ముడి నిజాయితీని ప్రపంచానికి తెలియజేసేందుకు మలేషియా వెళ్తాడు. ఈ రెండు సినిమాల్లో క్యారెక్టర్లు, జెండర్ వేరుగా ఉన్నా కానీ కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే అనే పాయింట్లు అందరిలోనూ ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. దీంతో మెగా, నందమూరి అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఊసరవెల్లి సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించగా.. వాల్తేరు వీరయ్య మూవీని బాబీ తెరకెక్కించాడు.