బాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ పలువురు హీరోలు బ్లైండ్ క్యారెక్టర్స్ చేశారు. ఆ మధ్య రవితేజ బ్లైండ్ క్యారెక్టర్ చేసిన ‘రాజా ది గ్రేట్’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో పాటు నితిన్ కూడా అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. ఇదిలా ఉంటే గత యేడాది కోలీవుడ్ స్టార్ వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళంలో ‘సింగ పార్వై’ మూవీలో గుడ్డి అమ్మాయిగా నటించింది. భరత్ రెడ్డి, రవి కాలే, తలైవాసల్ విజయ్, పాండీ కీలక పాత్రలు పోషించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ త్వరలో తెలుగులో ‘వర ఐపీఎస్’ పేరుతో విడుదల కాబోతోంది.
Read Also : Tiger Nageswara Rao : వేట మొదలైంది… స్టన్నింగ్ ప్రీ లుక్
శ్రీ లలితాంబిక ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎ. ఎన్. బాలాజీ దీన్ని తెలుగువారి ముందు తీసుకొస్తున్నారు. జగదీశ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘వర’ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. ఉగాది సందర్భంగా ఈ మూవీ పోస్టర్ ను నిర్మాతలు విడుదల చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళంలో కంటే తెలుగులోనే ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. బాలకృష్ణ మూవీతో పాటు ‘యశోద’, ‘హనుమాన్’ చిత్రాలలో ఆమె కీలక పాత్రలు పోషిస్తోంది. దాంతో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించి లేడీ ఓరియంటెడ్ తమిళ చిత్రాలను తెలుగులోనూ డబ్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
