ఓ నాటి అందాలతార, హిందీ సినిమా ఫస్ట్ సూపర్ స్టార్ ముద్దుల కూతురు, ఈ నాటి సూపర్ స్టార్ ప్రియమైన భార్య- ఇన్ని ఉపమానాలు విన్న తరువాత ఆమె ట్వింకిల్ ఖన్నా అని సినీఫ్యాన్స్ ఇట్టే పసికట్టేస్తారు. బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా, అప్పటి అందాలభామ డింపుల్ కపాడియా దంపతుల పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా. తల్లిదండ్రుల బాటలోనే పయనిస్తూ ట్వింకిల్ ఖన్నా సైతం కొన్ని చిత్రాలలో నాయికగా నటించారు. తెలుగు సినిమా ‘శీను’లో వెంకటేశ్ తోనూ జోడీ కట్టారామె. అక్షయ్ కుమార్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న ట్వింకిల్ తరువాత నటనకు దూరంగా ఉన్నారు. తన రచనలతోనూ, చిత్రలేఖనంతోనూ కాలం గడుపుతూ, ఇద్దరు పిల్లల తల్లి అయ్యారు. పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే తనకు ఇష్టమైన రచన కొనసాగించారు. మరోవైపు తన భర్త అక్షయ్ కుమార్ హీరోగా కొన్ని చిత్రాలనూ నిర్మించారు. ట్వింకిల్ ఖన్నా 2016లో రాసిన ‘ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’ అనే కథాసంపుటిలో ఓ కథ ఆధారంగా ‘సలామ్ నోనీ అప్పా’ అనే షార్ట్ ఫిలిమ్ ను తెరకెక్కించబోతున్నారు.
తన చెల్లెలు రింకీ ఖన్నాకు, తమ అమ్మమ్మకు మధ్య భలే అనుబంధముండేదని, దాని ఆధారంగానే తాను రాసిన ఓ కథతో ఈ ‘సలామ్ నోనీ అప్పా’ తెరకెక్కనుందని ట్వింకిల్ చెప్పారు. ఈ షార్ట్ ఫిలిమ్ ను ట్వింకిల్ కు చెందిన ఫన్నీ బోన్స్ సంస్థ, అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్స్, ఎల్లిప్సిస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సోనాల్ దబ్రాల్ దర్శకత్వం వహించనున్నారు. మరి ఇందులో ఎవరెవరు నటిస్తారు? ఎప్పుడు ఈ చిత్రం పట్టాలెక్కనుంది? అన్న విషయాలను త్వరలోనే చెబుతామన్నారు ట్వింకిల్. ఇప్పటికే ఆమె పలు పత్రికల్లో కాలమిస్ట్ గా రచనలు చేశారు. కథారచయిత్రిగానూ ఆమె పాపులర్. ఇప్పుడు సినిమా రచయిత్రిగానూ మారారన్నమాట! మరి ట్వింకిల్ ‘సలామ్ నోనీ అప్పా’ ఏ తీరున జనాన్ని ఆకట్టుకుంటుందో చూడాలి.