ప్రముఖ నటి పవిత్ర లోకేష్ దర్శకురాలిగా మారారు. రాజమండ్రి మహా కాళేశ్వరం దేవాలయం విశిష్టతను చాటుతూ ఆమె ఓ లఘు చిత్రం రూపొందించారు. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ లో దీన్ని సీనియర్ నటుడు వీకే నరేశ్ నిర్మించారు. ఈ చిత్రంలో నరేష్, పవిత్ర లోకేష్, దేవాలయ ధర్మకర్త పట్టపాగుల వెంకట్రావు, ఎం. సి. వాసు తదితరులు నటించగా, శ్రీశ్రీపురం కిరణ్ రచన చేశారు. మోహన్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ లఘు చిత్రం సీడీని శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతీలో శ్రీశ్రీశ్రీ కంచి కామకోటి శంకర విజయేంద్ర సరస్వతి అమృత హస్తాలతో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇతర పీఠాధిపతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఉత్తర భారతంలో ఉజ్జయిని దేవాలయాన్ని అనుసరిస్తూ దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో గోదావరి తీరాన రోటరీ స్వచ్ఛంద సంస్థ ధర్మకర్తలు శ్రీ పట్టపాగుల వెంకట్రావు ఆధ్వర్యంలో ఇది నిర్మించబడింది.
ఈ దేవాలయంలో సుమారు పది అడుగుల శివలింగంతో పాటు అమ్మవారి విగ్రహం, ఇతర దేవతల విగ్రహాలు, హైదవ మత గురువుల విగ్రహాలు దర్శనమిస్తాయి. పవిత్ర లోకేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ లఘు చిత్రం మహా కాళేశ్వరం డిజిటల్ యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారం అవుతుందని, దీనితో పాటుగా దేవాలయంలో రోజువారీ జరిగే హారతి, ఇతర కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చని నరేశ్ తెలిపారు.
