Sharada Completed 50 Years: ఆ రోజుల్లో శోభన్ బాబు – శారద జంటకు ప్రేక్షకుల్లో భలే క్రేజ్ ఉండేది. ‘మనుషులు మారాలి’ చిత్రంలో శారద, శోభన్ బాబు భార్యాభర్తలుగా నటించారు. ఆ సినిమా ఘనవిజయం తరువాత వారిద్దరూ నటించిన చిత్రాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరించసాగారు. కొందరు వారిద్దరూ నిజంగానే జీవితభాగస్వాములు అనే భావించారు. అంతలా వారి జంట ఆదరణ పొందింది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో అన్నపూర్ణ సినీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై రూపొందిన ‘శారద’లోనూ శోభన్ బాబు, శారద అభినయం అందరినీ అలరించింది. ఈ చిత్రానికి పి.రాఘవరావు నిర్మాత. ఈ సినిమాకు క్రాంతికుమార్ కూడా నిర్మాణభాగస్వామిగా వ్యవహరించారు. తరువాతి రోజుల్లో ‘అన్నపూర్ణ ఎంటర్ ప్రైజెస్’ పతాకంపై తెరకెక్కిన చిత్రాలకు ఆయన పేరే నిర్మాతగా టైటిల్ కార్డ్స్ లో చోటు చేసుకుంది. 1973 మే 4వ తేదీన ‘శారద’ జనం ముందు నిలచింది. వారి మనసులు గెలిచింది.
‘శారద’ కథ ఏమిటంటే – డాక్టర్ మూర్తి ఓ సైకియాట్రిస్ట్. తన భార్య, కొడుకుతో హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటాడు. మనసున్న డాక్టర్. పిచ్చిపట్టినవారికి మందులతో పాటు మంచి మాటలూ చెబుతూ వైద్యం చేస్తుంటాడు. ఓ మిత్రుని పెళ్ళికి ఓ పల్లెటూరు వెళతాడు. అక్కడ అందరూ ఆయనను చూసి దెయ్యంగా భావిస్తారు. ఆ ఊరి మునసబు ఇంట్లో పెళ్ళికే మూర్తి వెళతాడు. మునసబు కూడా మూర్తిని చూసి కంగుతింటాడు. ఇంతకు ముందు అక్కడ పనిచేసిన డాక్టర్ అచ్చు మీ పోలికలతోనే ఉండేవాడని, అతను ఇప్పుడు లేడని చెబుతాడు ఆ ఊరి పంతులు. ఆయన గతాన్ని వివరిస్తాడు – శారద అంటే ఆ ఊరి వారికి ఎంతో ప్రేమ. అలాగే ఆ ఊరన్నా, అక్కడివారన్నా ఆమెకూ అంతే అభిమానం. ఆమె తన అన్న కేశవతో కలసి జీవిస్తూ ఉంటుంది. ఆ ఊరికి ఓ డాక్టర్ వస్తాడు. అతను ఆమెను ప్రేమించి, ఊరి పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకుంటాడు. మొదటి రోజునే ఓ రోగి ప్రమాదంలో ఉన్నాడని తెలిసి వైద్యం చేయడానికి వెళతాడు. నదిలో పడవబోల్తాకొట్టి అతను కొట్టుకుపోయి మరణిస్తాడు. ఈ విషయం తెలిసిన శారద పిచ్చిదవుతుంది. ఆ తరువాత నుంచీ తన భర్త వస్తాడని ఆశిస్తూ ఉంటుంది. ఊళ్ళోవాళ్ళు కూడా అలాగే మీ ఆయన వస్తాడని చెబుతూ ఉంటారు. సైకియాట్రిస్ట్ అయిన మూర్తి, శారద భర్తలాగే నటిస్తూ పట్నం తీసుకువెళ్ళి వైద్యం చేయాలనుకుంటాడు. ఆయన భార్య సైతం ఆదరిస్తుంది. కానీ, ఆమె పిన్ని స్త్రీ సహజగుణంతో గొడవ చేస్తుంది. శారదకు మెల్లగా నిజం తెలుస్తుంది. తరువాత తన వల్ల తప్పు జరిగిందని అందరినీ మన్నించమని వేడుకుంటుంది. తన అన్నతో కలసి ఊరువెళ్తుంది. నది దాటుతూ ఉండగా ఆమెకు డాక్టర్ బాబుతో కలసి గడిపిన క్షణాలు గుర్తుకు వస్తాయి. అతను లేడన్న విషయం అర్థం చేసుకుంటుంది. అన్న భుజంపైనే తలవాల్చి శారద కన్నుమూయడంతో కథ ముగుస్తుంది.
శోభన్ బాబు, శారద, జయంతి, సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, రాజబాబు, సారథి, సత్తిబాబు, ఆశారాణి, బేబీ డాలి, శాంతాదేవి తదితరులు నటించారు. ఈ చిత్రానికి బొల్లిముంత శివరామకృష్ణ మాటలు రాయగా, డాక్టర్ సి.నారాయణరెడ్డి, దాశరథి, వీటూరి, ఆరుద్ర పాటలు పలికించారు. చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఇందులోని “వ్రేపల్లె వేచెను…”, “శారదా ననుచేరగా…”, “శారదా…శారదా…”, “శ్రీమతిగారికి తీరని వేళ…”, “అటో ఇటో తేలిపోవాలి…”, “కన్నె వధువుగా మారేది…”, “రాధాలోలా గోపాలా…”, “నా గుడిలో గంటలు మోగినవి…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ చిత్రానికి పి.రాఘవరావు నిర్మాత కాగా, కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.
‘శారద’ చిత్రం కన్నడలో రూపొందిన ‘యావ జన్మద మైత్రి’ ఆధారంగా తెరకెక్కింది. కన్నడలో కల్పన పోషించిన పాత్రను శారద ధరించారు. తరువాత తమిళంలో ‘రాధ’ పేరుతోనూ, హిందీలో హేమామాలినితో ‘దుల్హన్’గానూ ఈ కథ రీమేక్ అయింది. అన్ని చోట్లా ఈ కథ ఆకట్టుకుంది. తెలుగులో మంచి విజయం సాధించింది. హైదరాబాద్, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ‘శారద’. ఈ చిత్ర విజయంతో అన్నపూర్ణ సినీ ఎంటర్ ప్రైజెస్ సంస్థ మరిన్ని మంచి చిత్రాలు తీస్తూ సక్సెస్ రూటులో సాగిపోయింది. ఇందులోని “శారదా నను చేరగా…” పాట ఆ రోజుల్లో భలేగా ఆకట్టుకుంది. ముఖ్యంగా శారద పేరుగల అమ్మాయిలను టీజ్ చేసే కుర్రాళ్ళ నోట ఈ పాట నాట్యం చేసింది. ఏది ఏమైనా శారద తన పేరుతో రూపొందిన చిత్రంలోనే నటించి అలరించడం విశేషం! ఈ చిత్రంతో సంగీత దర్శకునిగా చక్రవర్తికి మంచి గుర్తింపు లభించింది. ఉత్తమ చిత్రంగా ‘శారద’ నంది అవార్డు గెలుచుకుంది.