Site icon NTV Telugu

Shahrukh Khan : షారుఖ్ ఖాన్ తో రాజ్ కుమార్ హిరాణీ ‘డంకీ’!

Shahrukh Raj Kumar

Shahrukh Raj Kumar

డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ మూవీస్ అనగానే అందులో వినోదంతో పాటు ఎంతో కొంత హృదయాలను తాకే అంశాలూ చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే ఆలోచింప చేసే విషయాలకూ స్థానం ఉండక పోదు. అంతేకాదు రాజ్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గానూ జేజేలు అందుకుంటూ ఉంటాయి. అందువల్ల ఆయన సినిమాల్లో నటించాలన్న అభిలాష బాలీవుడ్ టాప్ స్టార్స్ కూ సహజంగానే ఉంటుంది. మొన్నటి దాకా సూపర్ స్టార్ గా సాగిన షారుఖ్ ఖాన్ కు కూడా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో నటించాలన్న ఆసక్తి ఉంది. అది త్వరలో నెరవేరబోతోంది. వారిద్దరి కాంబోలో రాబోయే సినిమా పేరు ‘డంకీ’.

ఈ ‘డంకీ’ సినిమా గురించి ప్రకటించడమే కాదు, దాని కోసం షారుఖ్ తో కలసి రాజ్ కుమార్ హిరాణీ ఓ వీడియో తయారు చేశారు. అదే ఇక్కడి విశేషం! ఇందులో రాజ్ ఇంతకు ముందు సంజయ్ దత్ తో తీసిన ‘మున్నాభాయ్ ఎమ్.బి.బి.యస్.’, ఆమిర్ ఖాన్ తో తెరకెక్కించిన ‘పీకే’, రణబీర్ కపూర్ తో రూపొందించిన ‘సంజూ’ సినిమాల పోస్టర్స్ చూస్తూ ‘వావ్’ అనుకుంటారు షారుఖ్. అప్పుడే అక్కడకు వచ్చిన రాజ్ తో తనతోనూ సినిమా తీసే ఉద్దేశం ఉందా అని అడుగుతారు షారుఖ్. మీకు తగ్గ స్క్రిప్ట్ ఉందని రాజ్ సమాధానమిస్తాడు. అందులో కామెడీ ఉందా అని షారుఖ్ ప్రశ్న! చాలా ఉందని రాజ్ సమాధానం. ‘ఎమోషన్ ఉందా?’ అంటే అదీ ఉందంటారు రాజ్. రొమాన్స్ ఉందా అంటే, మూస ధోరణి వదిలేయాలంటారు రాజ్. ఇంతకూ సినిమా టైటిల్ ఏంటి అనగానే ‘డంకీ’అని సమాధానమిస్తారాయన. షారుఖ్ కాస్త కంగు తింటారు. ‘డాంకీ’ అనుకుంటారు. కానీ, ‘డంకీ’ అని క్లియర్ గా చెప్పి రాజ్ నిష్క్రమిస్తారు. ఇంతకూ ‘డంకీ’ అంటే అర్థమేంటని అడిగేలోగా అక్కడ రాజ్ కనిపించరు. షారుఖ్ కూడా అర్థం తెలియకుండానే వెళతారు. ఇలా సాగే వీడియోతో సరదాగా జనం ముందు తమ తాజా చిత్రం ప్రకటన నిలిచారు షారుఖ్, రాజ్.

తొలిసారి షారుఖ్ ఖాన్ తో రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించబోయే ‘డంకీ’ లో తాప్సీ పన్ను కూడా నటిస్తోంది. 2023 డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం రానుంది. అబ్బో… దాదాపు ఏడాదిన్నర సమయముంది. సంజయ్, ఆమిర్, రణబీర్ తో సినిమాలు తీసి మురిపించిన రాజ్ కుమార్ హిరాణీ ఈ సారి షారుఖ్ తో ఏ తరహా చిత్రం తెరకెక్కిస్తారో అన్న ఆసక్తి అభిమానుల్లో కలుగక మానదు. ఆరంభంలోనే ఈ వీడియోతో అహో అనిపించారు. మరి సినిమా ఏ తీరున అలరిస్తుందో?

Exit mobile version