Shah Rukh Khan Announces His Own OTT Platform Name.
కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవల కాలంలో భాషాతీతంగా ఓటీటీలో చిన్న సినిమాల మొదలు భారీ సినిమాల వరకూ రిలీజ్ అయ్యాయి. దీనివల్ల థియేటర్ల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడింది. ఇక ఈ ఊపులో పలు కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. అలా ప్రాంతీయభాషల్లోనూ పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పుట్టుకు వచ్చాయి. ఇది గమనించే కాబోలు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కూడా ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో మునిగి తేలుతున్న షారూఖ్ ఓటీటీలోకి అడుగుపెడితే పోటీ రసవత్తరంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్ లో ‘కుచ్ కుచ్ హోనే వాలా హై, ఓటీటీకి దునియా మే’ (ఓటీటీ ప్రపంచంలో ఏదో జరగబోతోంది) అంటూ షారూఖ్ చేసిన ట్వీట్ బ్యాక్ డ్రాప్ లో SRK+ లోగో కూడా ఉంది. అది తను సొంతంగా స్థాపించనున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోగో అనే వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇతర వివరాలేవీ లేవు. ‘త్వరలో రాబోతోంది.’ అని తప్ప వేరే అప్‌డేట్ లేదు. మిలియన్ల మంది అభిమానులు ఉన్న షారూఖ్ ఇప్పటికే ఐపిఎల్ లో ‘కలకత్తా నైట్ రైడర్స్’ వంటి టీమ్ తో విజయవంతమైన బిజినెస్ మేన్ అని నిరూపించుకుకున్నాడు. మరి ఓటీటీ ప్లాట్ ఫామ్ SRK+ తో కూడా సక్సెస్ సాధిస్తాడేమో చూద్దాం.
